Begin typing your search above and press return to search.

విశాఖకు లోకేష్... ఆ మీడియాకు షాక్... ?

By:  Tupaki Desk   |   24 Feb 2022 9:01 AM GMT
విశాఖకు లోకేష్... ఆ మీడియాకు షాక్... ?
X
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విశాఖకు వచ్చారు. ఆయనకు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం టీడీపీ శ్రేణుల నుంచి లభించింది. ఇక లోకేష్ విశాఖకు సడెన్ గా రావడం వెనక ఒక కీలక వ్యవహారం ఉంది. ఆయన మంత్రిగా విశాఖ వచ్చినపుడు ఒక సందర్భంలో పాతిక లక్షల టిఫిన్ బిల్లులు పెట్టారని ఒక మీడియాలో వచ్చిన వార్తా కధనం అసత్యమని సవాల్ చేస్తూ పరువు నష్టం దావా వేశారు.

ఆ కేసు నిమిత్తం లోకేష్ విశాఖలోని 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టుకు హాజరవుతున్నారు. ఇదిలా ఉండగా తనమీద తప్పుడు వార్తలు రాసినందుకు గానూ ఏకంగా 75 లక్షలకు లోకేష్ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇక చూస్తే ఈ మధ్య వార్తలు కంటే ఊహాగానాలే అన్ని చోట్లా కనిపిస్తున్నాయి. తోచింది వండి వార్చేసే వారు తయారైపోయారు. మరో వైపు చూసుకుంటే సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ ని కూడా క్షణాల్లో వార్తలుగా మలచడానికి పోటీ పడుతున్నారు. ఈ పోటీలో చాలా మటుకు అవాస్తవాలు, గాలి వార్తలే జనాలకు చేరుస్తున్నారు.

వీటిలో ఏది నిజమో ఏది అబద్ధమో కూడా ప్రజలకు అర్ధం కావడంలేదు. కొందరు ఈ తరహా వార్తలను నమ్మి తీవ్ర ఉద్వేగానికి కూడా గురి అవుతున్నారు. మరి కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక రాజకీయ నాయకుల మీద వార్తలు అంటే చెప్పాల్సిన పని లేదు, బాధ్యత లేకుండా రాసి పారేస్తున్నారు. ఎక్కడో ఏదో చోట చూశామని ఏ ఆధారం లేకుండా రాస్తున్న ఈ తరహా వార్తలు కొన్ని సార్లు వివాదం అవుతున్నాయి.

దాంతోనే పరువు నష్టం దావాల దాకా ఈ కధలు వెళ్తున్నాయి. ఒకపుడు ఇన్విస్టిగేటివ్ జర్నలిజం ఉండేది, తీగ దొరికితే మొత్తం డొంక అంతా పట్టుకుని శోధించి సాధించి దాన్ని అద్భుతమైన వార్తగా పక్కా ఆధారాలతో ఇచ్చేవారు. దాంతో అవతల వారు కూడా ఏమీ అనలేని పరిస్థితి ఉండేది.

ఇపుడు చూస్తే మీడియాలో కూడా రాజకీయాలు ప్రవేశించాయి. పార్టీలుగా వర్గాలుగా చీలిపోయిన క్రమంలో ఏ ఆధారం లేకుండా రాయడం వెనక కేవలం రాజకీయ ప్రయోజనాలూ కక్ష కార్పణ్యాలే కనిపిస్తున్నాయి. మరి దీనికి ఎవరైనా చూస్తూ ఊరుకోరుగా. అందుకే కొందరు కోర్టుల దాకా వెళ్తున్నారు. పరువు నష్టం దావాలూ వేస్తున్నారు. ఇపుడు లోకేష్ ఒక మీడియా మీద అదే విధంగా కేసు వేశారు.

ఇక ఏపీలో చీకట్లు కమ్ముకున్నాయని, విద్యుత్ కోతలు అంటూ మెయిన్ స్ట్రీం మీడియాలో ఈ మధ్య పెద్ద ఎత్తున నాన్ స్టాప్ గా వచ్చిన వార్తల పట్ల ఏపీ విద్యుత్ శాఖ అసహనం ఆగరహం వ్యక్తం చేసింది. దాంతో వారి మీద కూడా పరువు నష్టం వేస్తామని అంటోంది. మొత్తానికి చూస్తే గాలి వార్తల వల్ల క్షణికానందం ఉండవచ్చు కానీ ఆ మీదట ఎవరైన తెగించి కోర్టులకు వెళ్తే పరువు మర్యాదలు మంటగలవడం ఖాయమని అంటున్నారు. అయినా ఈ గాలి ఈ జోరూ ఆగుతుందా అంటే చెప్పడం కష్టమే.