Begin typing your search above and press return to search.

ఆప్ పగ్గాలు జేడీకే....ఏపీలో నేతల‌ క్యూ ...?

By:  Tupaki Desk   |   31 March 2022 2:30 AM GMT
ఆప్ పగ్గాలు జేడీకే....ఏపీలో నేతల‌ క్యూ ...?
X
ఆమ్ ఆద్మీ పార్టీ ఇపుడు దేశంలో మారుమోగుతున్న పార్టీ. పంజాబ్ ఎన్నికల తరువాత జాతీయ రాజకీయ యవనిక మీద ఆప్ బాగానే మెరుస్తోంది. దాంతో పాటు సౌత్ స్టేట్స్ లో కూడా విస్తరించేందుకు కూడా వ్యూహ రచన చేస్తోంది. ఈ నేపధ్యంలో బలమైన నాయకులను తమ వైపు తిప్పుకోవాలనుకుంటోంది. ఇక ఏపీలో ఆప్ పార్టీ పగ్గాలు అందుకునేందుకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ రెడీగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. నిజాయతీపరుడైన సీబీఐ అధికారిగా జేడీ పేరు తెచ్చుకున్నారు.

ఇక ఆయన సమాజానికి సేవ చేయాలన్న లక్ష్యంతో నాలుగేళ్ళ క్రితం ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి వచ్చేశారు. 2019 ఎన్నికలలో జనసేన నుంచి విశాఖ ఎంపీ సీటుకు జేడీ పోటీ చేస్తే రెండు లక్షల డెబ్బై అయిదు వేల ఓట్లు వచ్చాయి. అలా ఫస్ట్ అటెంప్ట్ లోనే జేడీ దూసుకుపోయారు. ఇక జేడీకి జనసేన విధానాలు నచ్చక పార్టీ నుంచి తప్పుకున్నారు. ఆయన ప్రస్తుతం కాపు నేతల మీటింగులతో బిజీగా ఉన్నారు.

అలాగే బీసీలు, బహుజనులతో ఏపీలో మూడవ ఆల్ట‌ర్నేషన్ ని తీసుకురావాలని చూస్తున్నారు. ఈ నేపధ్యంలో జేడీ చూపు ఆప్ మీద పడింది అంటున్నారు. ఆప్ ని స్థాపించింది కూడా ఒకనాటి ప్రభుత్వ ఉద్యోగే. దాంతో అరవింద్ కేజ్రీవాల్ ఆలోచనలు జేడీ ఆలోచనలు కూడా సరిపోతాయని అంటున్నారు. ఇక జేడీకి ఆప్ పగ్గాలు అప్పగించడం ద్వారా ఏపీలో విస్తరించాలని కేజ్రీవాల్ చూస్తున్నారు అంటున్నారు.

ఏపీలో కాపుల ప్రాబల్యం అధికంగా ఉంది. జేడీ ఆ సామాజికవర్గానికి చెందిన వారు. పైగా మేధావిగా, నిజాయతీ కలిగిన మాజీ అధికారిగా యువతలో, విద్యాధికులలో మంచి పేరు ఉంది. క్లీన్ ఇజేం ఉంది. ఈ నేపధ్యంలో జేడీని ముందు పెడితే ఏపీలో ఎంతో కొంత పొలిటికల్ మ్యాజిక్ జరిగే అవకాశం ఉందని ఆప్ పెద్దలు భావిస్తున్నారుట.

దీంతో ఇప్పటికే జేడీ వారికి టచ్ లోకి వచ్చారని అంటున్నారు. ఇక త్వరలో అరవింద్ కేజ్రీవాల్ హైదరాబాద్ రానున్నారని, అక్కడ ఆయనను జేడీ కలుస్తారు అని ప్రచారం సాగుతోంది. మరోవైపు జేడీతో పాటు, కొందరు ఉన్నత విద్యావంతులు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వివిధ పార్టీలలో ఉన్న్ నేతలు కూడా కేజ్రీవాల్ సమక్షంలో ఆప్ లో చేరుతారు అంటున్నారు.

జేడీ ఆలోచనలు కానీ ఆప్ వ్యూహాలు కానీ చూస్తే ఏపీలో సొంతంగానే ఎదగాలని ఉంది అంటున్నారు. ఇక జేడీ తన సన్నిహితులతో అంటున్న మాట ఏంటి అంటే ఏపీలో వైసీపీ, టీడీపీలకు ఆల్టర్నేషన్ గా కొత్త పార్టీని తీసుకురావాలని, 2024 నాటికి అలా జరుగుతుందని కూడా చెబుతున్నారు. ఇపుడు ఆప్ రూపంలో జేడీ మాటలు నిజం అయ్యేలా ఉన్నాయని అంటున్నారు.

ఈ మధ్య జేడీ బహుజనులదే ఏపీలో అధికారం అని కూడా చెబుతున్నారు. ఆ విధంగా చూసుకుంటే టీడీపీతో కానీ వేరే ఇతర పార్టీలతో కానీ పొత్తులు లేకుండా కేజ్రీవాల్, జేడీల వ్యక్తిగత ఇమేజ్ తో పాటు, ఆప్ సిద్ధాంతాలతోనే ఏపీలో ఆప్ బలపడాలన్నదే వారి వ్యూహం అంటున్నారు. అదే కనుక జరిగితే ఏపీలో వచ్చే ఎన్నికల వేళకు ఆప్ కొత్త పార్టీగా సీన్ లో ఉంటుంది. పైగా ఏపీ రాజకీయాలలో ఏమైనా శూన్యత ఉంటే అది ఆప్ కి వరంగా మారుతుంది అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మొత్తానికి అధికార వైసీపీ, విపక్ష టీడీపీ టార్గెట్ గా ఆప్ అడుగులు పడుతున్నాయని అంటున్నారు.