Begin typing your search above and press return to search.

పవన్ సీఎం కావాలంటే అలాంటి ప్రిపరేషన్ ఉండాలిట... ?

By:  Tupaki Desk   |   20 Feb 2022 1:30 AM GMT
పవన్ సీఎం కావాలంటే అలాంటి ప్రిపరేషన్ ఉండాలిట... ?
X
పవన్ కళ్యాణ్ సీఎం అని జనసైనికులు గట్టిగా నినాదాలు ఇస్తారు. వారి నినాదాలను ఇలా చాలు అని పవనే ఆపుతారు. అది వేరే సంగతి. ఆయన మొహమాటపడో, లేక మీరు కష్టపడి పనిచేయకుండా ఎందుకీ నినాదాలు అని ముద్దుగా కసురుకోనో ఇలా అంటారు కానీ పవన్ కి మాత్రం సీఎం కావాలని ఉండదా. ఆ మాటకు వస్తే 2019 ఎన్నికల వేళ పవన్ ఇచ్చిన ప్రతీ స్పీచ్ లో తాను సీఎం అయితే ఇలా చేస్తాను అలా చేస్తాను అనే చెప్పారు. ఇక పవన్ సోదరుడు, మెగా బ్రదర్ నాగబాబు కూడా మంచి సీఎం కావాలంటే ఏపీ ప్రజలు పవన్ని ఏదో రోజు గెలిపిస్తారు అని చెబుతూ వస్తున్నారు.

మరి జనసేనకు పవన్ సీఎం కావాలని ఎంతో బలంగా ఉంది. కానీ తిప్పి తిప్పి చూస్తే ఎన్నికలు గట్టిగా రెండేళ్లకు వచ్చేశాయి. మరి పవన్ నాయకత్వాన జనసేన ఆ విధంగా ఎన్నికలకు రెడీ అవుతోందా అంటే జవాబు నిరాశగానే ఉంది. ఈ రోజుకీ చాలా చోట్ల పార్టీ బాధ్యులు లేరు, ఇక పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ వరకూ డెవలప్ చేస్తామని చెబుతున్నారే కానీ ఆ దిశగా చర్యలు అయితే లేవు.

పవన్ కళ్యాణ్ సినిమాలు అయితే వరసబెట్టి చేస్తున్నారు. మధ్యలో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కానీ అవి అయితే జనసేనకు అధికారం సాధించేందుకు సరిపోవు. మరి పవన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్నది కూడా చర్చగా ఉంది. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఎన్నికల ముందు టీడీపీతో పొత్తు పెట్టుకుంటారని, బీజేపీని కూడా ఆ వైపుగా లాగేందుకు చూస్తారని ప్రచారం అయితే ఉంది.

ఒక వేళ బీజేపీ పొత్తుకు నో చెబితే జనసేన సోలోగా వచ్చి టీడీపీతో జట్టు కడుతుందని కూడా అంటున్నారు. సరే ఇదంతా జరిగినా దీని వల్ల జనసేనకు ఏంటి లాభం అన్నదే చర్చ మరి. జనసేన టార్గెట్ సీఎం పదవి కదా. టీడీపీకి మద్దతు ఇస్తే ఆ కోరిక అసలు నెరేవేరకు పోగా కోరి మరీ టీడీపీని బలోపేతం చేసినట్లు అవుతుంది అని కూడా విశ్లేషణలు ఉన్నాయి.

అలా కాకుండా పవన్ తన పార్టీని విస్తరించుకునేందుకు పూర్తి సమయం కేటాయించాలని, ఆయన ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా 2024లో పోటీ చేయాలని సూచనలు అందుతున్నాయట. ఈసారి పవన్ పార్టీకి బలం మాత్రం కచ్చితంగా పెరుగుతుందని, అదే సమయంలో అధికారం దక్కపోయినా జనసేన ఒక నిర్ణయాత్మకమైన శక్తిగా ఏపీలో అవతరిస్తుందని అంటున్నారు.

ఈ ట్రయాంగిల్ ఫైట్ లో ఒకవేళ వైసీపీ గెలిచినా జనసేనకు రాజకీయంగా పోయేది ఏమీ లేదని, పైగా పొలిటికల్ గా అది మంచి ఎత్తుగడ అని కూడా అంటున్నారు. 2024లో శక్తి కూడదీసుకుని 2029 ఎన్నికల కోసం పవన్ ప్రిపరేషన్ మొదలుపెడితే కచ్చితంగా మరో ఐదేళ్లకు ఆయనే ఏపీ సీఎం అని విశ్లేషణలు అయితే ఉన్నాయి. అదెలా అంటే 2024 ఎన్నికల్లో టీడీపీ ఓడితే ఇక ఆ పార్టీ దుకాణం బంద్ కాక తప్పదని, ఆ విధంగా జనసేన ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రమోషన్ దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నారు.

ఇక 2029 నాటికి రెండు దఫాలుగా అధికారంలో ఉన్న వైసీపీ మీద సహజంగానే వ్యతిరేకత వస్తుందని, ఆనాడు బంగారు పళ్ళెంలో అధికారం జనసేన చేతిలోనే జనాలు పెడతారు అని కూడా అంటున్నారు. అంటే పవన్ మార్క్ రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వారు, ఆయన సీఎం కావాలని కోరుకునే శ్రేయోభిలాషుల మాట ఏంటి అంటే పవన్ తన ముందు ఉన్న ఒక బలమైన ప్రత్యర్ధి టీడీపీ అడ్డుని ముందు తొలగించుకోమనే.

రాజకీయంగా చూస్తే ఇదే కరెక్ట్ అయిన వ్యూహమని కూడా చెబుతున్నారు. అలా కాకుండా జగన్ మీద వ్యక్తిగత ద్వేషం కారణంగానో, చంద్రబాబు మీద అభిమానం తోనో పవన్ కనుక టీడీపీ జట్టు కడితే మాత్రం ఆయన సీఎం ఆశలు ఎపుడు నెరవేరుతాయి అంటే ఎవరూ జవాబు చెప్పలేరు అనే అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ కి సోలో ఫైటే సో బెటర్ అని కూడా సూచనలు అందుతున్నాయట. మరి ఇదంతా ఒక చర్చ. దీని మీద ఏ నిర్ణయం తీసుకోవాలో జనసేన అధినాయకత్వానిదే డెసిషన్ అని అంటున్నారు.