Begin typing your search above and press return to search.

డ్రంకెన్ డ్రైవ్ లో మందుబాబుల వీరంగం.. రోడ్డు మీద అడ్డంగా పడుకొని హల్ చల్

By:  Tupaki Desk   |   30 March 2022 4:32 AM GMT
డ్రంకెన్ డ్రైవ్ లో మందుబాబుల వీరంగం.. రోడ్డు మీద అడ్డంగా పడుకొని హల్ చల్
X
హైదరాబాద్ మహానగరంలో తరచూనిర్వహించే డ్రంకెన్ డ్రైవ్ గురించి తెలిసిందే. సాధారణ వాహనదారులతో కలిసి పోయి వాహనాల్ని నడిపే మందుబాబుల్ని గుర్తించి.. వారిపై కేసులు నమోదు చేస్తుంటారు. అప్పుడప్పుడు ఇలాంటి డ్రైవ్ లు నిర్వహించే వేళలో.. ఒకరిద్దరు ఓవరాక్షన్ చేయటం.. పోలీసులపై విరుచుకుపడటం లాంటివి చేస్తుంటారు. ఇందుకు భిన్నంగా మంగళవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని పార్క్ హయత్ హోటల్ కు దగ్గరగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

మద్యం సేవించి వాహనాల్ని నడుపుతున్న వారిని అడ్డుకొని.. వారిపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులకు చుక్కలే కనిపించాయి. దీనికి కారణం మందుబాబులు వేసిన వీరంగం అంతా ఇంతా కాదు. ఇది సరిపోదన్నట్లుగా వీరికి హిజ్రాలు తోడు కావటంతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తమను తనిఖీలు చేస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగిన మందుబాబులు.. రోడ్డుకుఅడ్డంగా పడుకొని.. లేవమంటే లేవమంటూ భీష్మించుకోవటంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో.. వారిని లేపేందుకు.. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చింది.

దాదాపు మూడు గంటల పాటు సాగిన మందుబాబుల హైడ్రామాతో హైదరాబాద్ పోలీసులకు చుక్కలు కనిపించాయి. తాగింది కాక.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వారిని అదుపు చేసేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. పోలీసులతో వాగ్వాదం చేస్తూనే.. రోడ్డుకు అడ్డంగా పడుకున్నారు. సరైన పత్రాలు లేని వాహనాల్ని ఇవ్వటం కుదరదన్న పోలీసులపై వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

చేసింది ఎదవ పని అయినప్పటికీ.. పోలీసుల విధి నిర్వహణను అడ్డుకోవటంతో పాటు.. సాధారణ పౌరులకు ఇబ్బందికరంగా మారిన వీరి తీరుతో మిగిలిన వాహనదారులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ఇటీవల కాలంలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ లో ఇలాంటి ఉదంతాలు ఎప్పుడూ చోటు చేసుకోలేదన్న మాట వినిపిస్తోంది.

చివరకు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించటంతో పాటు.. న్యూసెన్స్ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు. మత్తు వదిలిన తర్వాత సరైన రీతిలో వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. లేకుంటే.. ఇలాంటి కల్చర్ అలవాటుగా మారితే.. పోలీసులతో పాటు సామాన్యులకు సైతం ఇబ్బంది కలగటం ఖాయమని చెప్పక తప్పదు.