Begin typing your search above and press return to search.

అలా ఔటైన తొలి క్రికెటర్ అశ్విన్.. ఐనా అదే మలుపు

By:  Tupaki Desk   |   11 April 2022 11:30 AM GMT
అలా ఔటైన తొలి క్రికెటర్ అశ్విన్.. ఐనా అదే మలుపు
X
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో దాదాపు పావు వంతు మ్యాచ్ లు అయిపోయాయి. టోర్నీ పాకాన పడుతోంది. ఏ జట్ల పరిస్థితి ఏమిటో తెలిసిపోతోంది. దిగ్గజాలైన ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు బోణీనే కొట్టలేకపోతున్నాయి. వీటికంటే చాలా బలహీనమైదిగా కనిపించిన గుజరాత్ టైటాన్స్, ఆఖరికి లక్నో సూపర్ జెయింట్స్ కూడా మంచి విజయాలు సాధించాయి. కోల్ కతా నైట్ రైడర్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తమదైన ముద్ర చూపాయి. అయితే, కొందరు కుర్రాళ్ల మెరుపులు కూడా ఆయా జట్లను విజేతలుగా నిలుపుతున్నాయి. చెన్నై,ముంబైకి మాత్రం అదేమీ లేక ఈసురోమంటున్నాయి.

ఆదివారం మ్యాచ్ లో భలే వ్యూహం

ముంబైలోని వాంఖడే మైదానంలో ఆదివారం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 165/6 స్కోర్‌ చేసింది. విధ్వంసక ఓపెనర్ బట్లర్ (13), జాస్ బట్లర్ (29) సహా కెప్టెన్ సంజూ శాంసన్ (13) నిరాశపర్చడంతో ఓ దశలో ఆ జట్టు 67/4 తో నిలిచింది. కానీ షిమ్రన్ హెట్ మెయిర్ (36 బంతుల్లో 59; 1 ఫోర్, 6 సిక్సులు) చెలరేగి ఆడి జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు.అతడికి అశ్విన్‌ (28; 23 బంతుల్లో 2x6)సహకారం అందించాడు. దీంతో జట్టుక గౌరవప్రద స్కోరు అందుకుంది.

అశ్విన్ అవుట్.. అదే మ్యాచ్ కు మలుపు

అయితే , రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో అశ్విన్‌ రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. టోర్నీ చరిత్రలో ఇలా వైదొలగిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అలసిపోయి షాట్లు ఆడలేకపోతుండటంతో అశ్విన్‌ వెనుదిరిగి ఉండొచ్చని తెలుస్తోంది. రిటైర్డ్‌ ఔట్‌ అనేది ఓ వ్యూహాత్మక ఎత్తుగడ. మెరుగైన ముగింపు కోసం రాజస్థాన్‌ జట్టు మేనేజ్‌మెంట్‌ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. రిటైర్డ్‌ హర్ట్‌ అయిన బ్యాటర్‌లా.. రిటైర్డ్‌ ఔట్‌ అయిన బ్యాటర్‌ తిరిగి బ్యాటింగ్‌ రావడానికి వీల్లేదు. కాగా, అశ్విన్‌ స్థానంలో క్రీజులోకి వచ్చిన పరాగ్‌ (4 బంతుల్లో 8; 1సిక్స్) ఓ సిక్స్‌ కొట్టడం గమనార్హం.

అదే తేడా..

వాస్తవానికి అశ్విన్ క్రీజులో ఉంటే ఇంకా ఎక్కువ పరుగులు చేసేవాడా? లేదా? అన్నది ఇక్కడ వదిలేస్తే రిటైర్డ్ ఔట్ గా అతడు వెళ్లిపోయాక వచ్చిన పరాగ్ ఫర్వాలేదనిపించాడు. ఇక అనంతరం ఛేదనకు దిగిన లఖ్‌నవూ 20 ఓవర్లకు 162/8 స్కోరుకే పరిమితమైంది. క్వింటన్‌ డికాక్‌ (39; 32 బంతుల్లో 2x4, 1x6), మార్కస్‌ స్టాయినిస్‌ (38 నాటౌట్‌; 17 బంతుల్లో 2x4, 4x6) గెలిపించే ప్రయత్నం చేశారు. అయినా, చివరికి రాజస్థాన్‌ 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. అంటే.. పరాగ్ కొట్టిన సిక్సర్ కంటే తక్కువ మార్జిన్ తోనే లఖ్ నమవూ ఓడిపోయింది.

అదే అశ్విన్ క్రీజులో ఉండి.. పరుగులు సాధించలేక ఇబ్బంది ఉంటే రాజస్థాన్ తక్కవు స్కోరే చేసి ఉండేది. ఇక్కడ మరో అంశమూ చెప్పుకోవాలి. లఖ్ నవూకు చివరి ఓవర్లో గెలుపునకు 15 పరుగులు అవసరమయ్యాయి. ఆస్ట్రేలియాకు చెందిన విధ్వంసక బ్యాట్స్ మన్ మార్కస్ స్టొయినిస్ కు మధ్యప్రదేశ్ కు చెందిన పేసర్ కుల్దీప్ సేన్ వరుసగా 3 డాట్ బాల్స్ వేసి ఆశ్చర్యపరిచాడు. తొలి బంతికి సింగిల్ రాగా.. 2,3,4 బంతులకు పరుగులేమీ రాలేదు. చివరి రెండు బంతులను స్టొయినిస్ 4, 6 కొట్టినా ఫలితం లేకపోయింది. రిటైర్డ్ అవుట్ తో అశ్విన్.. చివరి ఓవర్ తో కుల్దీప్ సేన్ ఇలా తమ ప్రత్యేకత నిలుపుకొన్నారు.