Begin typing your search above and press return to search.

ఢిల్లీ కబురు... త్వరలో బాబుకు బీజేపీ పిలుపు...?

By:  Tupaki Desk   |   28 Feb 2022 4:30 PM GMT
ఢిల్లీ కబురు... త్వరలో బాబుకు బీజేపీ పిలుపు...?
X
ఏపీలో చంద్రబాబు అన్ని రకాలైన సమీకరణలు రెడీ చేసి పెట్టుకున్నారు. ఆయన లక్ష్యం వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్నదే. తనకు జాతీయ రాజకీయాలు అసలు ముఖ్యమే కాదని బాబు ఈ సమయంలో స్పష్టం చేస్తున్నారు. తాను మారిన మనిషిని అని కూడా అంటున్నారు. బాబుకు కావాల్సింది జగన్ కుర్చీ ఖాళీ చేయడం. అంతే తప్ప ఢిల్లీలో రాజకీయ లెక్కలు తేల్చడం కాదు.

అందుకే ఎందరు జాతీయ నేతలు వత్తిడి పెడుతున్నా ఎక్కడెక్కడ నుంచో ఫోన్లు వస్తున్నా బాబు మాత్రం పూర్తి ఫోకస్ ఏపీ మీదనే పెట్టి ఉంచారు. తన రాజకీయ రధానికి పరమ పధ సోపానికి ఏపీ అధికార పీఠమే అంది వచ్చిన మార్గమని బాబు తలపొస్తున్నారు.

ఇక చంద్రబాబు చూపు అయితే 2024 ఎన్నికల మీదనే ఉంది. ఆ ఎన్నికల్లో చావో రేవో అన్నట్లుగానే టీడీపీకి సీన్ ఉంటుంది. దాంతో తాను గెలిచి తీరాలీ అంటే కచ్చితంగా బీజేపీ జనసేనల మద్దతు తప్పనిసరి అని ఆయన భావిస్తున్నారు. ఎంత దూరం అయినా వెళ్ళి ఈ రెండు పార్టీలతో పొత్తు కుదుర్చుకోవాలని చూస్తున్నారు. ఒక విధంగా 2014 ఎన్నికల పొత్తుని రిపీట్ చేయాలని చూస్తున్నారు.

ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది అని భావిస్తున్నారు. ఇక జనసేనతో పొత్తు ఖాయమనే టీడీపీ తమ్ముళ్లు ధీమాగా ఉన్నారు. ఇక సానుకూలత రావాల్సింది బీజేపీ నుంచే. దాని కోసం కూడా తెర వెనక ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. వచ్చే ఎన్నికల తరువాత కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని బాబు కచ్చితంగా నమ్ముతున్నారు.

దాంతో బీజేపీకి వ్యతిరేకంగా ఏ రకమైన చర్యలకు ఆయన పాల్పడంలేదు. బీజేపీతో ఏపీలో పొత్తు కోసం కూడా చూస్తున్నారు. బీజేపీ పొత్తు ఉంటేనే ఏపీలో టీడీపీకి అన్ని రకాలుగా సాయం అందుతుంది అని ఆయన లెక్కలు వేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికలలో అర్ధ బలం కూడా చాలా ముఖ్యం.

బీజేపీ మద్దతు ఉంటే దన్ను బాగా దొరుక్తుంది. ఇక టీడీపీకి ఫండింగ్ చేయడానికి ఇప్పటికైతే చాలా మంది రెడీగా ఉన్నా కేంద్రం భయంతోనే వారు వెనకా ముందు ఆడుతున్నారు. అందుకే బీజేపీతో పొత్తు ఉంటే ఆర్ధికంగా కూడా ఇబ్బందులు తొలగుతాయని ఆయన గట్టి నమ్మకం మీద ఉన్నారని అంటున్నారు.

బీజేపీకి వచ్చే ఎన్నికల్లో మూడవ సారి పీఠం దక్కేందుకు తన వంతు సహకారం అందిస్తామని టీడీపీ చెబుతోంది. మొత్తానికి బీజేపీకి కూడా ఏపీలోని రాజకీయ పార్టీల మద్దతు అవసరం. వైసీపీ, టీడీపీలలో ఎవరో ఒకరితో పొత్తు లేదా తెర వెనక ఒప్పందాలు అవసరం.

ఎందుకంటే వచ్చే ఎన్నికల తరువాత బీజేపీకి పూర్తి మెజారిటీ అయితే కేంద్రంలో రాదు, అందుకే వారు కూడా ఎవరు తమకు నమ్మకస్తులు అని చూస్తున్నారు. అదే సమయంలో ఏపీలో రాజకీయ గాలి ఏ వైపు ఉంది అన్న చర్చ కూడా సాగుతోంది. ఆ విధంగా కనుక చూస్తే వైసీపీ గ్రాఫ్ తగ్గినట్లు లెక్క తేలితే కచ్చితంగా చంద్రబాబుకు నేరుగా ఢిల్లీ ఫోన్ వస్తుందని అంటున్నారు.

అదే కనుక జరిగితే జనసేన బీజేపీ టీడీపీ కూటమి ఏపీలో ఏర్పాటు కావడం ఖాయం. 2024లో కనుక ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుంటే గెలుపు కూడా ఖాయమనే అంటున్నారు. మొత్తానికి చూస్తే చంద్రబాబు పక్కా స్కెచ్ వేసుకుని మరీ ఢిల్లీ వైపు చూస్తున్నారు. మరి ఢిల్లీ కబురు ఏంటి అన్నదే ఇప్పటికి అయితే సస్పెన్స్.