Begin typing your search above and press return to search.

బండి సంజ‌య్ దూకుడు...పాద‌యాత్ర షెడ్యూల్ రిలీజ్‌

By:  Tupaki Desk   |   28 Feb 2022 11:40 AM GMT
బండి సంజ‌య్ దూకుడు...పాద‌యాత్ర షెడ్యూల్ రిలీజ్‌
X
తెలంగాణ ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై విరుచుకుప‌డ‌టంలో ముందున్న బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన నాటి నుంచి అదే దూకుడు కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. అవ‌కాశం వ‌చ్చిన‌ప్ప‌డల్లా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్న సంజ‌య్‌ మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తాజాగా హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జోనల్ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతోపాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు జోనల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు వివ‌రించారు.

ఈనెల 6 నుండి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ తెలిపారు. తొలుత హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న‌ట్లు సంజయ్ వివ‌రించారు.

భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులుతో హైదరాబాద్ నుండి చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సక్సెస్ అయింద‌ని పేర్కొన్న బండి సంజ‌య్‌ అందుకే పార్లమెంట్ స్థాయి తొలి సదస్సు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నామ‌ని తెలిపారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించకుని ఏప్రిల్ 14 నుండి రెండో దశ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభిస్తున్నామ‌ని బండి సంజ‌య్ ప్ర‌క‌టించారు.

సీఎం కేసీఆర్ జనగామ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ ఉనికి లేదన్నారని గుర్తు చేసిన బండి సంజ‌య్ అదే జనగామలోనే మార్చి నెలాఖరులో బీజేపీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ సత్తా చూపిస్తామ‌ని ప్ర‌క‌టించారు. బీజేపీ కార్యకర్తలు చేసిన పోరాటాలవల్లే బెంగాల్ లో బీజేపీ ఓట్ల శాతం 40 శాతం దాటిందని బండి సంజ‌య్ గుర్తు చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్న బండి సంజ‌య్‌ దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమ‌ని వివ‌రించారు. హైదరాబాద్ సిటీలో బీజేపీ ఓటు బ్యాంక్ 60 శాతానికి పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైందని, గత ఎన్నికల ఫలితాలతోపాటు వివిధ సర్వేల్లో వెల్లడైన ఫలితాలే నిదర్శనమ‌ని వివ‌రించారు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలియడంతో సీఎం కేసీఆర్ బోగస్ సర్వే ఫలితాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారని పేర్కొన్న బండి సంజ‌య్ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నార‌ని తెలియ‌జేశారు. ఎప్పుడు ఎన్నికలు వ‌చ్చినా బీజేపీ సిద్ధంగా ఉంద‌ని పేర్కొన్న బండి సంజ‌య్ ఈసారి అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలవడం ఖాయమ‌ని జోస్యం చెప్పారు.