Begin typing your search above and press return to search.

విశాఖ రైల్వే జోన్ కు గ్రీన్ సిగ్నల్

By:  Tupaki Desk   |   26 March 2022 6:18 AM GMT
విశాఖ రైల్వే జోన్ కు గ్రీన్ సిగ్నల్
X
వైజాగ్ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయబోతున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఓకే చెప్పిందని వైష్ణవ్ పార్లమెంటులో ప్రకటించారు. నిజానికి ఇప్పుడు కేంద్ర మంత్రి ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ విభజన చట్టంలో చెప్పిందానికి విరుద్ధం. విభజన చట్టంలో చెప్పింది విశాఖ కేంద్రం ప్రత్యేక రైల్వే జోన్.

నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటును తుంగలో తొక్కేశారు. విభజన చట్టంలోని హామీని చీలికలు పీలికలు చేసి చివరకు మొక్కుబడిగా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అనే ముష్టిపడేసింది కేంద్రం. ప్రత్యేక రైల్వే జోన్ అంటే యావత్ ఉత్తరాంధ్రకు చాలా ఉపయోగముండేది. అయితే దీనికి భువనేశ్వర్ అంగీకరించలేదు. ఎందుకంటే ఇపుడు భువనేశ్వర్ కేంద్రంగా పనిచేస్తున్న రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం పరిధిలోనే వాల్తేరు డివిజన్ ఉంది. దీని ద్వారా మొత్తం రైల్వేజోన్ కు విపరీతమైన బిజినెస్ జరుగుతోంది.

విభజన చట్టం అమలయ్యుంటే భువనేశ్వర్ రైల్వే జోన్ కు పోటీగా మరో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటయ్యుండేది. అప్పుడు వాల్తేర్ డివిజన్ తో పాటు మరికొన్ని డివిజన్లు కూడా వైజాగ్ ప్రత్యేక రైల్వే జోన్ పరిధిలోకి వచ్చేసేది. దాంతో భువనేశ్వర్ రైల్వేజోన్ ఆదాయం పడిపోయేది. అందుకనే భువనేశ్వర్ అడ్డుపడింది. ఇపుడు వైజాగ్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి చాలా చిన్నది. కొత్తగా ఏర్పడబోతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కూడా భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న రైల్వేజోన్ పరిధిలోనే ఉంటుంది కాబట్టి దాని ఆదాయం ఎటూపోదు.

తాజాగా మంత్రి ప్రకటన ప్రకారం దక్షిణకోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు అవసరమైన కార్యాలయాల ఏర్పాటుకు భూమిని పరిశీలిస్తున్నారు. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో జనాలకు ఏదో సమాధానం చెప్పుకునేందుకని హడావుడిగా కేంద్రమంత్రి ప్రకటన చేసినట్లుంది.