Begin typing your search above and press return to search.

మూడేళ్లలో ఎయిర్ ట్యాక్సీ సేవలు.. రూ.12కే విమాన ప్రయాణం!

By:  Tupaki Desk   |   25 March 2022 7:28 AM GMT
మూడేళ్లలో ఎయిర్ ట్యాక్సీ సేవలు.. రూ.12కే విమాన ప్రయాణం!
X
కిలోమీటర్ కు రూ.12 చార్జీ.. అది ఎయిర్ ట్యాక్సీ.. ఈ కలను సాకారం చేయడానికి రెడీ అవుతోంది ‘జెట్ సెట్ గో’ కంపెనీ. ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటోల్) ఎయిర్ క్రాఫ్ట్ తో ఇది సాధ్యం చేస్తామని చెబుతోంది. అద్దెకు ప్రైవేటు విమానాలను నడుపుతున్న ఈ సంస్థ ఈవీటోల్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఎయిర్ ట్యాక్సీ రంగంలోకి రావాలని కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం రెండు తయారీ సంస్థలతో మాట్లాడుతున్నామని జెట్ సెట్ గో ఏవియేషన్ సర్వీసెస్ ఫౌండర్ కనిక టేక్రీవాల్ రెడ్డి తెలిపారు.

తొలుత హైదరాబాద్, ఆ తర్వాత ముంబై, బెంగళూరులో ఎయిర్ ట్యాక్సీ సేవలు పరిచయం చేస్తామన్నారు. బేగం పేట విమానాశ్రయంలో గురువారం ప్రారంభమైన వింగ్స్ ఇండియా-2022 సందర్భంగా కనిక ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. ఎయిర్ ట్యాక్సీ, కంపెనీ, పరిశ్రమ గురించి వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 12 సంస్థలు ఈవీటోల్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారీలో ఉన్నాయని.. వీటిని నడపడానికి పైలెట్ అవసరం లేదన్నారు. పైకి లేచినప్పుడు.. కిందకు దిగేటప్పుడు నిటారుగా ప్రయాణిస్తాయన్నారు. ల్యాండింగ్, టేకాఫ్ కోసం ల్యాండింగ్ ప్యాడ్స్ అవసరం అన్నారు. ఒక్కో ట్యాక్సీలో నలుగురు ప్రయాణించవచ్చని తెలిపారు. ఒకసారి చార్జింగ్ తో 40 కి.మీలు వెళ్లవచ్చని తెలిపారు. కి.మీకు అయ్యే చార్జి రూ.12 మాత్రమేనన్నారు.

ఈవీటోల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఖరీదు సుమారు రూ.23లక్షలు ఉంటుందని కనిక తెలిపారు. ఎయిర్ ట్యాక్సీ సేవలను మూడేళ్లలో సాకారం చేస్తామని తెలిపారు. ల్యాండింగ్ ప్యాడ్ 8 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు ఉంటే చాలని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం అన్నారు. తొలిదశలో ఈ ప్రాజెక్ట్ కోసం రూ.1900 కోట్లు ఖర్చు చేస్తామన్నారు.ప్రైవేటు రంగంలో తొలి ఏవియేషన్ సెంటర్ హైదరాబాద్లో రూ.30 కోట్ల ఖర్చుతో మే నాటికి ఏర్పాటు చేస్తున్నామని కనిక తెలిపారు.