Begin typing your search above and press return to search.

మంత్రి మేక‌పాటి చివ‌రి ఫొటో ఇదే!

By:  Tupaki Desk   |   21 Feb 2022 5:33 PM GMT
మంత్రి మేక‌పాటి చివ‌రి ఫొటో ఇదే!
X
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (49) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. ఈ ఉదయం గుండెపోటు రావడంతో హుటాహుటిన గౌతమ్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించా రు. అయితే ఆయన్ను ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందినట్లు అపోలో వైద్యులు వెల్లడించారు.

గౌతమ్‌రెడ్డి ఏపీ ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత వారం రోజులుగా దుబాయ్‌ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్న అనంతరం నిన్ననే హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆయన చివరిసారిగా దుబాయ్‌లోని ఖలీజ్ టైమ్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

అనంత‌రం ఆయ‌న ఓ వివాహ నిశ్చితార్థానికి హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, మంత్రి తండ్రి, మాజీ ఎంపీ రాజ‌మోహ‌న్‌రెడ్డి కూడా ఉన్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఆశాంతం త‌న చేతుల మీద‌నే మంత్రి గౌతం నిర్వ‌హించిన‌ట్టు చంద్ర‌మోహ‌న్‌రెడ్డి చెప్పారు. అతిథుల‌ను రిసీవ్ చేసుకోవ‌డంతోపాటు.. వారికి కుర్చీల‌ను చూపించ‌డం వ‌ర‌కు ఆఖ‌రుకు విందు వ‌ర‌కు అన్నీతానై వ్య‌వ‌హ‌రించారు. ఇది ఆదివారం రాత్రి జ‌రిగింది.

ఈ స‌మ‌యంలోనే ఆయ‌న తన బంధువుల‌తో క‌లిసి ఫొటోలు దిగారు. వీరిలో అనంత‌పురం జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌, మాజీ ఎమ్మె్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి త‌న‌యుడు అస్మిత్ రెడ్డి కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇదే ఆఖ‌రి ఫొటో అని.. గౌతంరెడ్డి విడిచి వెళ్లిన చివ‌రి జ్ఞాప‌క‌మ‌ని.. అస్మిత్ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీకి ఆది నుంచి బలమైన మద్దతుదారుగా ఉన్న రాజకీయనాయకుడు, పారిశ్రామికవేత్త మేకపాటి రాజమోహన్‌ రెడ్డి కుమారుడు గౌతమ్‌ రెడ్డి. ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండుసార్లు గౌతమ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వైకాపా తరఫున ఆయన విజయం సాధించారు.

గౌతమ్‌రెడ్డి తొలిసారిగా 2014లో ఆనం రామనారాయణ రెడ్డిపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ సమయంలో జిల్లాలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన నాయకుడిగా గౌతమ్‌ రికార్డు సృష్టించారు. 2019లో రెండో పర్యాయం ఆయన బొల్లినేని కృష్ణయ్యపై విజయం సాధించి కేబినెట్‌ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. గత నెల 22వ తేదీన మేకపాటి గౌతమ్‌రెడ్డి కరోనా బారినపడ్డారు. అప్పట్లో స్వల్పలక్షణాలు ఉండటంతో చికిత్స పొంది కోలుకొన్నారు.