Begin typing your search above and press return to search.

ఏపీలో పెద్ద ఎత్తున ఓట్ల రద్దు... నిజమేనా...?

By:  Tupaki Desk   |   24 Aug 2022 11:30 AM GMT
ఏపీలో పెద్ద ఎత్తున ఓట్ల రద్దు... నిజమేనా...?
X
ప్రతీ ఎన్నిక ముందు ఓట్లు గల్లంతు అయ్యాయని వార్తలు వస్తూంటాయి. దాని కంటే ముందు అధికారంలో ఉన్న వారు తమకు వ్యతిరేకంగా ఉన్న సెక్షన్ల ఓట్లను రద్దు చేస్తున్నారు అని విపక్షాలు యాగీ చేయడమూ సహజంగా జరిగే పరిణామమే. ఇపుడు ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. దాంతో ఈ తరహా ఆరోపణలు మొదలయ్యాయి. అయితే దీనిని చేసింది టీడీపీ కాదు, బీజేపీ వారు. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పెద్ద ఎత్తున ఏపీలో ఓట్లను రద్దు చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు.

ఏపీలో కావాలనే ఇలా ఓట్లను తొలగిస్తున్నారు అని ఆయన అంటున్నారు. అంతే కాదు ఏపీలో ఆంధ్రేతర ప్రాంతానికి చెందిన ఓటర్లను కావాలనే తొలగించారని జీవీఎల్ అంటున్నారు. ఈ ఓట్లు ఒకటీ రెండూ కాదు ఏకంగా యాభై వేల పై చిలుకు ఓట్లు ఏపీలో గల్లంతు అయ్యాయని జీవీఎల్ లెక్కలతో సహా చెబుతున్నారు.

ఈ విషయం మీద తాము చీఫ్ ఎన్నికల కమిషన్ కి లేఖ కూడా రాసామని ఆయన చెప్పారు. అలాగే ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని కూడా కోరినట్లుగా జీవీఎల్ చెప్పుకొచ్చారు. ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న ఇలాంటి చర్యలను అడ్డుకోవాల్సి ఉందని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కాం లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీలకు సంబంధాలు ఉన్నాయని జీవీల్ మరో సంచలన ఆరోపణ చేశారు. అందుకే దీని పైన ఇప్పటిదాకా రెండు ప్రభుత్వాలు స్పందించడం లేదు అని ఆయన అన్నారు. మరో ఐపు లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో హిందూపూర్ లో 4,200 ఎకరాలు బ్యాంకులకు తనఖా పెట్టారని అన్నారు.

ఇక ఆ భూములను 500 కోట్లకే ఒక ప్రైవేటు సంస్ధ చేజెక్కించుకుందంటే ఎంత దారుణం జరిగిందో తెలుసుకోవాలని ఆయన అన్నారు. మొత్తానికి చూస్తే జీవీల్ చేసిన ఈ అరోపణల మీద ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది చూడాలి. మరో వైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ భేటీలో రాజకీయప్రస్తావన లేకుండా ఎలా ఉంటుంది అని జీవీఎల్ ప్రశ్నించి కొత్త సందేహాలకు తెర తీశారు.

అంటే కచ్చితంగా రాజకీయాల గురించి మాట్లాడి ఉంటారని కూడా అంటున్నారు. అయితే ఏమేమి వారు మాట్లాడుకున్నారు అన్నది వారిద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయో వారే చెప్పాలని ఆయన అనడం విశేషం.