Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ లో గ‌జం రూ.ల‌క్ష‌న్న‌ర‌!

By:  Tupaki Desk   |   23 April 2018 5:10 AM GMT
హైద‌రాబాద్ లో గ‌జం రూ.ల‌క్ష‌న్న‌ర‌!
X
పుష్క‌ర‌కాలం తర్వాత హైద‌రాబాద్ లో రియ‌ల్ ఎస్టేట్ దూసుకెళుతోంది. అప్పుడెప్పుడో వైఎస్ జ‌మానాలో రియ‌ల్ రేట్లు భారీగా పెర‌గ‌టం తెలిసిందే. వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత హైద‌రాబాద్ రియ‌ల్ ప్ర‌భ మ‌స‌క‌బార‌ట‌మే కాదు.. మ‌ళ్లీ కోలుకోలేదు. ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాలు.. పెద్ద‌నోట్ల ర‌ద్దుతో పాటు.. బ్యాంకింగ్‌కు సంబంధించి మోడీ స‌ర్కారు తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. వెర‌సి హైద‌రాబాద్ లో భూముల ధ‌ర‌లు భారీగా పెరిగిన ప‌రిస్థితి.

దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత హెచ్ ఎండీఏ (మ‌హాన‌గ‌ర అభివృద్ధి సంస్థ‌) నిర్వ‌హించిన ఇళ్ల ప్లాట్ల వేలానికి అనూహ్య స్పంద‌న రావ‌ట‌మేకాదు.. అధికారుల‌కు సైతం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ (పాజిటివ్‌గా) అయ్యేంత ధ‌ర‌లు వేలంలో ప‌లికింది. తాము వేసుకున్న అంచ‌నాల‌కు రెట్టింపుగా ధ‌ర ప‌ల‌క‌టంతో వారుఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హైద‌రాబాద్ భూముల‌కు ఇంత వాల్యూ పెరిగిందా? అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

మాదాపూర్ లో గ‌జం ధ‌ర గ‌రిష్ఠంగా వెళ్ల‌టమే కాదు.. రికార్డుస్థాయిలో రూ.1.52 ల‌క్ష‌లు ప‌ల‌క‌టం ఒక విశేష‌మైతే.. న‌గ‌ర శివారుగా ఒక‌ప్పుడు పేరున్న చందాన‌గ‌ర్ లో గ‌జం రూ.70వేలు ప‌లికింది. ఇక‌.. మియాపూర్ లో రూ.62వేలు ప‌ల‌క‌గా.. న‌ల్ల‌గండ్ల‌లో రూ.42వేలు ప‌ల‌క‌టం విశేషం.

మాదాపూర్ లోని ఇమేజ్ గార్డెన్ ద‌గ్గ‌ర ఉన్న ఖాళీ స్థ‌లానికి ప్ర‌భుత్వం గ‌జం రూ.64వేలుగా నిర్ణ‌యించ‌గా.. ఆన్ లైన్ వేలానికి రూ.1.52 లోలు కోట్ చేశారు. అదే స‌మ‌యంలో మియాపూర్ ద‌గ్గ‌ర గ‌జం రూ.24వేలుగా అధికారులు పేర్కొంటే.. అక్క‌డ ఏకంగా రూ.62,200 ప‌లికింది. 74 ఫ్లాట్ల విక్ర‌యానికి ఏకంగా రూ.182 కోట్లు రావ‌టం విశేషం. బహిరంగ మార్కెట్లో ధ‌ర‌లు భారీగా ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం నిర్వ‌హించిన వేలానికి ఇంత భారీగా ధ‌ర‌లు రావ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. తాజా ప‌రిణామంతో ప్రైవేటుగా భూముల ధ‌ర‌లు మ‌రింత పుంజుకోవ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో దూసుకెళుతున్న‌ రియ‌ల్ ధ‌ర‌లు చూస్తే.. అంద‌రి హైద‌రాబాద్ కాస్తా రానున్న రోజుల్లో కొంద‌రి హైద‌రాబాద్ గా మారుతుందేమోన‌న్న భావ‌న క‌ల‌గ‌క మాన‌దు.