Begin typing your search above and press return to search.

విశాఖలో 5 శాతం నుండి 50 శాతం పెరగనున్న భూముల ధరలు

By:  Tupaki Desk   |   1 Aug 2020 6:40 PM IST
విశాఖలో 5 శాతం నుండి 50 శాతం పెరగనున్న భూముల ధరలు
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ వ్యాల్యూను మరోసారి పెంచుతోంది. ఆయా ప్రాంతాల్లో భూముల మార్కెట్ వ్యాల్యూ పెరుగుదల, తగ్గుదలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ వ్యాల్యూ పెంపుకు ఆదేశాలు జారీ చేసింది. కనిష్టంగా ఐదు శాతం, గరిష్టంగా యాభై శాతం పెంచనున్నారు. ఈ మేరకు వెబ్‌సైట్లో వివరాలు పొందుపరిచారు. శనివారం నుండి అభ్యంతరాలను స్వీకరిస్తారు. వీడిని క్రోడీకరించి 10వ తేదీ నుండి కొత్త ధరలను అమలు చేస్తారు.

విశాఖ జిల్లాలో కనిష్టంగా అయిదు శాతం, గరిష్టంగా 50 శాతం భూముల వ్యాల్యూ పెరగనుంది. భీమిలిలో వ్యవసాయ భూమి వ్యాల్యూ 50 శాతం పెంచనున్నారు. ప్రతి సంవత్సరం ఆగస్ట్‌లో భూముల రిజిస్ట్రేషన్ వ్యాల్యూ సవరణ ఉంటుంది. ఇందులో భాగంగా గత ఏడాది పది శాతం పెంచారు. ఇప్పుడు విశాఖను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ధరలు భారీగా పెరిగాయి. ధరల పెంపు కోసం గత కొద్దిరోజులుగా కసరత్తు చేస్తున్నారు.

ఏపీలో భూముల ధరలు పెరగనున్నాయని, ఇందుకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలు విడుదల కానున్నాయని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. పట్టణాలు, నగరాలలోని వ్యవసాయ భూములు, ఆపార్టుమెంట్స్, ఖాళీ స్థలాల వ్యాల్యూ పెరగనుంది. ఇప్పటికే నిర్మాణాల మార్కెట్ వ్యాల్యూ పెంపుపై ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఆర్సీసీ భవనాలు, రేకుల షెడ్స్, పౌల్ట్రీ ఇలా వివిధ రకాల కట్టుబడి విలువలు సవరించింది. పూరిగుడిసెకు పెంచలేదు.

భూముల వ్యాల్యూ విషయానికి వస్తే పరిపాలనా రాజధాని విశాఖలో జిల్లా రిజిస్ట్రార్ సారథ్యంలో సబ్ రిజిస్ట్రార్లు... జాయింట్ కలెక్టర్‌కు శుక్రవారం ప్రతిపాదనలను సమర్పించారు. వాటిని సమీక్షించి ప్రజలకు అందుబాటులో పెట్టాలని సూచించారు. ఈ వివరాలు శనివారం నుండి అందుబాటులోకి వస్తున్నాయి.

మధురవాడ కెజీహెచ్ కాలనీలో గజం ధర రూ.18,100 ఉండగా దానిని 5 శాతం పెంపుతో రూ.19వేలకు, పీఎంపాలెం ఎస్సీ కాలనీలో 8 శాతం, రామాలయం వీధిలో 20 శాతం, పరదేశీపాలెంలో 22 శాతం, ఆనందపురం పెందుర్తి మార్గంలోని పలు ప్రాంతాల్లో 5 శాతం నుండి 13 శాతం పెంచుతున్నారు. రిషికొండ బీచ్ రోడ్డులో రూ.25వేలకు, మధురవాడలో గజం రూ.45వేలకు, భీమిలిలో ఎకరా వ్యవసాయ భూమి రూ.2 కోట్ల నుండి రూ.3 కోట్లకు పెంచుతున్నారు. ఈ వివరాలన్నీ వెబ్‌సైట్లో ఉంచారు. వారం రోజుల్లో అభ్యంతరాలు తెలియజేస్తే వాటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకొని, ఆగస్ట్ 10వ తేదీ నుండి అమలు చేస్తారు.