Begin typing your search above and press return to search.

కేసీఆర్ జీ.. ల‌క్ష మొక్క‌ల్ని పీకేసిన క‌బ్జాగాళ్లు!

By:  Tupaki Desk   |   7 Aug 2018 4:24 AM GMT
కేసీఆర్ జీ.. ల‌క్ష మొక్క‌ల్ని పీకేసిన క‌బ్జాగాళ్లు!
X
ఎంత ధైర్యం.. ఎన్ని గుండెలు? లాంటి మాట‌లు అస్స‌లు అక్క‌ర్లేదు. విప‌క్షాల‌కు సింహ‌స్వ‌ప్న‌మైన తెలంగాణ అధికార‌పక్షం.. తెలంగాణ‌లోని కొన్ని వ‌ర్గాలు మాత్రం అస్స‌లు ప‌ట్టించుకోవ‌టం లేదు. ఆ మాట‌కు వ‌స్తే.. లైట్ తీసుకుంటోంది. ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన కార్య‌క్ర‌మాన్ని సైతం పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌ట‌మే కాదు.. మొక్క‌లే క‌దా అని సింఫుల్ గా పీకేసిన వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

ఒకే ద‌ఫాలో ల‌క్ష మొక్క‌ల్ని దాటాల‌న్న సంక‌ల్పంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌ట‌మే కాదు.. దానికి భారీ ప్ర‌చారం ఇచ్చారు. మొక్క‌ల్ని నాట‌టం ద్వారా తెలంగాణ‌లో ప‌చ్చ‌ద‌నాన్ని పెంచాల‌న్న కేసీఆర్ క‌ల‌ను క‌బ్జారాయుళ్లు చెరిపేస్తున్నారు.

ఓప‌క్క ప్ర‌భుత్వం నాటిన ల‌క్షకు పైగా మొక్క‌ల్ని పీకి పారేశారు. ఇలాంటి వారికి టీఆర్ఎస్ కు చెందిన కొంద‌రు నేత‌లు అండ‌గా నిల‌వ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. అధినేత అంత అమిత‌మైన భ‌య‌భ‌క్తుల్ని ప్ర‌ద‌ర్శించే అనుచ‌ర గ‌ణం.. అదే అధినేత క‌ల‌ను లైట్ తీసుకోవ‌ట‌మే కాదు.. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ప్ర‌భుత్వం వెంట‌నే దృష్టి సారించాల‌ని చెబుతున్నారు.

క‌బ్జాకు గురైన అట‌వీ భూముల్లో అట‌వీ శాఖ భారీ ఎత్తున మొక్క‌ల్ని నాటింది. క‌బ్జాకు గురైన వాటి జోలికి వెళ్లొద్దంటూ అట‌వీశాఖా మంత్రి జోగురామ‌న్న స్వ‌యంగా ఆదేశించారు కూడా. అయినా.. క‌బ్జాగాళ్ల‌కు మాత్రం అవేమీ ప‌ట్ట‌లేదు స‌రిక‌దా.. జూలై ఒక్క నెల‌లో ఏకంగా ల‌క్షా ఐదువేల‌కు పైగా మొక్క‌ల్నిపీకి పారేసిన వైనం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.

ఈ మొక్క‌ల‌న్నీ గ‌డిచిన మూడేళ్ల‌లో హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో నాటిన మొక్క‌లు కావ‌టం విశేషం. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఉన్న 24 శాతం ప‌చ్చ‌దాన్ని 33 శాతానికి పెంచాల‌న్న సంక‌ల్పంతో ప్ర‌భుత్వం భారీగా ఖ‌ర్చు చేస్తోంది. ఇందుకోసం నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో 230 కోట్ల మొక్క‌ల్ని నాటేలా భారీ ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా 80 కోట్ల మొక్క‌ల‌ను అట‌వీ ప్రాంతాల పున‌రుద్ధ‌ర‌ణ‌కు.. మ‌రో 20 కోట్ల మొక్క‌లు ద‌ట్ట‌మైన అడ‌వుల్లో నాటాల‌ని డిసైడ్ అయ్యారు.

మిగిలిన 130 కోట్ల మొక్క‌ల్ని మైదాన ప్రాంతాల్లోనూ.. క‌బ్జాదారుల ఆక్ర‌మ‌ణ‌లో ఉన్న వాటిల్లో నాటాల్సిందిగా నిర్ణ‌యించారు. ఇందుకోసం వంద‌లాది కోట్లను ఖ‌ర్చు చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం కోసం ప్ర‌భుత్వం పెట్టిన ఖ‌ర్చు ఎంతో తెలుసా? అక్ష‌రాల రూ.2535.7 కోట్లు. ఇంత భారీగా ప్ర‌జాధ‌నాన్ని ఖ‌ర్చు చేస్తుంటే.. మ‌రోవైపు అధికార‌ప‌క్షం అండ‌తో నాటిన మొక్క‌ల్నికొంద‌రు క‌బ్జాదారులు పీకేయ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఈ వ్య‌వ‌హారంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వ‌యంగా దృష్టి సారిస్తే త‌ప్పించి.. విష‌యం ఒక కొలిక్కి రాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి.. కేసీఆర్ సార్ ఏం చేస్తారో చూడాలి.