Begin typing your search above and press return to search.

ఈటెలపై విచారణలో ఏం తేలిందంటే?

By:  Tupaki Desk   |   1 May 2021 8:39 AM GMT
ఈటెలపై విచారణలో ఏం తేలిందంటే?
X
తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ భూవివాదానికి సంబంధించి ఈరోజు మెదక్ జిల్లా కలెక్టర్ విచారణ జరిపారు. అచ్చంపేటలో బాధిత రైతుల నుంచి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. తమ భూమిలో మంత్రి ఈటల రాజేందర్ పరిశ్రమ పెట్టారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఎన్ని సార్లు సర్వే చేయించి హద్దు రాళ్లు వేయించినా మంత్రి అనుచరులు వాటిని తొలగించి నిర్మాణాలు చేపట్టారని తమ దగ్గరున్న ఆధారాలు అందజేశారు.

ఇక అసైన్డ్ భూముల ఆక్రమణ నిజమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ తేల్చిచెప్పారు. ఆరోపణలు వచ్చిన భూముల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన కలెక్టర్ విచారణ చేపట్టారు. బాధితుల భూములు కబ్జా అయిన మాట వాస్తవం అని కలెక్టర్ తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఆరు ప్రత్యేక బృందాలు ఈటల భూములపై సర్వే చేస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. తుఫ్రాన్ ఆర్డీవో రాంప్రకాష్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ఈ భూములను సర్వే చేశారని తెలిపారు. ఈటలపై ఏ క్షణమైనా నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.

మెదక్ కలెక్టర్ మాట్లాడుతూ 'మూడు గంటల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నాం. అసైన్డ్ భూములు కబ్జా చేశారని ప్రాథమిక విచారణలో తేలింది. బాధితులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరిస్తున్నాం.. బాధితులకు అన్యాయం జరిగింది. ప్రస్తుతం 117 ఎకరాల్లో సర్వే కొనసాగుతుంది. మూడు గంటల్లో సర్వే పూర్తవుతుంది' అని తెలిపారు.ఇక సర్వే నేపథ్యంలో తుఫ్రాన్ డీఎస్పీ ఆధ్వర్యంలో భారీగా పోలీసులు గ్రామంలో.. మంత్రి ఈటల ఫాంహౌస్ సమీపంలో మోహరించారు.