Begin typing your search above and press return to search.

జైగోమాంసం అంటే ఓట్లొస్తాయని లాలూ ఆశ

By:  Tupaki Desk   |   4 Oct 2015 4:09 AM GMT
జైగోమాంసం అంటే ఓట్లొస్తాయని లాలూ ఆశ
X
తాను ఏ పని చేసినా దాని వెనుక రాజకీయ ప్రయోజనం ఉండాలని కోరుకునే లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు.. గోమాంస భక్షణకు జై కొడితే.. రాష్ట్రంలో తనకు ముస్లిం ఓటు బ్యాంకు గంపగుత్తగా లాభిస్తుందనే యోచనతో ఉన్నట్లు కనిపిస్తోంది.

ఉత్తరప్రదేశ్‌ లో గొడ్డు మాంసం తింటున్నారనే నెపంతో ఒక ముస్లింని కొట్టి చంపిన ఘటన నేపథ్యంలో ఆర్జెడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ప్రకటన తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. హిందువులు కూడా గొడ్డు మాంసాన్ని తింటున్నారని, బీజేపీ - ఆరెస్సెస్‌ ఈ విషయాన్ని మతపరంగా మలుస్తూ విభజన తీసుకురావాలని కుట్ర పన్నుతున్నారని లాలూ ఆరోపించారు. కాగా లాలూ మతి పూర్తిగా పోయిందని బీజేపీ తిప్పికొట్టింది.

లాలూ తన వైఖరిని కొనసాగిస్తూ బీఫ్ అంటే ఆవు మాంసం కాదని, మాంసం తింటున్నవారు గో మాంసానికి, మేక మాంసానికి మధ్య వ్యత్యాసం చూపలేరని లాలూ వ్యాఖ్యానించారు. పైగా గొడ్డు మాంసం తింటున్నవారు అనాగరికులు అని కూడా లాలూ పేర్కొన్నారు. గొడ్డు మాంసం తింటున్నవారు నాగరికత తెలిసిన వారు కారు. వారు పేదవారైనందునే ఆకలిని చల్లార్చుకోవడానికి చౌక ధరకు వచ్చే మాంసాన్ని తింటున్నారు. దేశం బయటకు వెళుతున్న వారు కూడా బీఫ్ తింటున్నారు. చివరకి హిందువులు కూడా బీఫ్ తింటున్నారు. గొడ్డు మాంసానికి - మేక మాంసానికి పెద్దగా తేడా ఉండదు అని లాలూ మీడియాకు తెలిపారు.

మాంసాహారిగా ఉండి తర్వాత శాకాహారిగా మారిన లాలూ మాంసం తినడం ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి మాంసాహారాన్ని వదిలేయడమే మంచిదన్నారు. అదే సమయంలో ఆరెస్సెస్, బీజేపీలు ఈ విషయాన్ని మతపర విభజన కోసం ఉపయోగించుకుంటున్నాయని, కానీ బీహార్ లో వారి ఆటలు చెల్లవని లాలూ హెచ్చరించారు.
బీఫ్ లేదా మటన్ తింటున్నారని పుకారు ప్రాతిపదికన ఎవరినైనా చంపడం చాలా తప్పని లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. ఎవరో ఏదో తింటున్నారన్న పుకారుతో నేనొక వ్యక్తిని చంపితే అది చాలా తప్పు. ప్రతి ఒక్కరికీ తనకు ఇష్టమైనది తినే హక్కుంది. దాద్రిలో జరిగింది మతపరమైన హింస. దానికి బీజేపీయే బాధ్యత వహించాలి అని లాలూ పేర్కొన్నారు.

అయితే లాలూకు ఉన్నమతి కూడా పోయినట్లుందంటూ బీజేపీ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ధ్వజమెత్తారు. గోవులు పెంచే హిందువులు ఎన్నటికీ బీఫ్ స్వీకరించరని, లాలూ తన మాటల్ని వెనక్కు తీసుకోకుంటే లాలూ ఇంటిముందే తాను నిరసన దీక్ష చేపడతానని గిరిరాజ్ హెచ్చరించారు.