Begin typing your search above and press return to search.

అబ్బే.. అది అచ్చు తప్పంటున్న లాలూ

By:  Tupaki Desk   |   7 Oct 2015 5:00 AM IST
అబ్బే.. అది అచ్చు తప్పంటున్న లాలూ
X
పెద్దోడ్ని చిన్నోడ్ని చేసేసి.. చిన్నోడ్ని పెద్దోడుగా మార్చేసి వయసు వివిదాన్ని చాలా సింఫుల్ గా కొట్టిపారేశారు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్. తన పుత్రరత్నాలు ఇద్దరూ ఈసారి ఎన్నికల బరిలో నిలవటం.. పెద్దకొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ తన వయసు తన తమ్ముడి కంటే తక్కువగా నమోదు చేసుకున్నట్లుగా ఎన్నికల అఫిడవిట్ బయటకు రావటంతో దేశ వ్యాప్తంగా ఇదో సంచలన వార్తాంశం అయ్యింది.

ఎలా జరిగిందన్న విషయాన్ని పక్కన పెడితే.. జరిగిన దానికి డ్యామేజ్ భారీగా జరుగుతుందటం చూసిన లాలూ అలెర్ట్ అయిపోయారు. ఇక.. కొడుకులిద్దరిలో ఎవరు పెద్ద అన్నది ఒక చర్చగా మారటంతో..దీన్ని వెంటనే తుంచేయకపోతే ఇబ్బందనుకున్నారేమో కానీ.. తన అనుభవాన్ని అంతటిని ఉపయోగించి.. విషయాన్ని చాలా సింఫుల్ గా తేల్చేశారు.

వయసు విషయంలో ప్రింటింగ్ మిస్టేక్ వల్ల జరిగిందే తప్పించి.. దాన్ని భూతద్దంలో చూడకూడదని సలహా ఇచ్చిన ఆయన.. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసినట్లుగా చెప్పుకొచ్చారు. ఓటర్ ఐడీ కార్డులో ఉన్న వయసునే రాశామని.. దాని వివరాలు నమోదు చేసిన వాడు చేసిన తప్పుతో ఇలా జరిగిందని.. ఓటరుకార్డులో ఉన్నదే తాము రాశామని చెప్పుకున్నారు.

ఓటర్ కార్డులో తప్పులు దొర్లటం కామన్. కానీ.. ఆ తప్పుల్ని సరిదిద్దుకునేందుకు సామాన్యులు కిందామీదా పడుతుంటారు. మరి.. లాలూ లాంటి వారు తప్పుగా కార్డును చూసుకొని గమ్మున ఎందుకున్నారు? వారి లాంటి వారు తలుచుకుంటే.. కార్డులోని తప్పు చెరిగిపోవటం ఎంతసేపు? ఇంతకాలం కళ్లు మూసుకొని ఇప్పుడు చెబుతున్న వివరణ చూస్తే.. లాలూ తెలివి ఎంతో తెలుస్తుంది.

తప్పు ఎక్కడ దొర్లిందో కానీ.. లాలూ మాత్రం ఇప్పుడు దాన్ని ప్రింటింగ్ తప్పుగా తేల్చేయటం గమనార్హం. మరి.. దీనికి ఎన్నికల కమిషన్ ఏం చెబుతుందో..? ఎలాంటి వివరణ ఇస్తుందో..?