Begin typing your search above and press return to search.

నితీశ్ సీఎం.. లాలూ కొడుకు డిప్యూటీ సీఎం

By:  Tupaki Desk   |   20 Nov 2015 6:01 AM GMT
నితీశ్ సీఎం.. లాలూ కొడుకు డిప్యూటీ సీఎం
X
మరికాసేపట్లో బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే.. ఇప్పుడు ఈ విషయానికి మించి.. మరో అంశం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణం సంగతి ఓకే.. డిప్యూటీ సీఎంగా ఎవరు ప్రమాణం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. జేడీయూ నేతృత్వంలో ఆర్జేడీ.. కాంగ్రెస్ లతో కలిపి లౌకిక మహాకూటమి ఏర్పాటు చేయటం.. ఈ ఫార్మూలా సక్సెస్ కావటమే కాదు.. బంపర్ మెజార్టీతో విజయం సాధించటం తెలిసిందే.

అయితే.. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత.. జేడీయూ కంటే ఆర్జేడీకి తొమ్మిది సీట్లు ఎక్కువగా గెలుచుకోవటం ఆసక్తికరంగా మారింది. మామూలుగా అయితే.. కూటమిలో ఎవరికైతే ఎక్కువ సీట్లు వస్తాయో వారికే ముఖ్యమంత్రి పదవి కట్టబెడుతుంటారు. ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీశ్ ను ప్రకటించిన నేపథ్యంలో ఈ విషయం మీద ఎలాంటి చర్చ షురూ కాలేదు. కాకపోతే.. అత్యధిక సీట్లు సొంతం చేసుకున్నందున డిఫ్యూటీ సీఎం పదవిని ఆర్జేడీకి ఇవ్వాలన్న వాదన మొదలైంది. దీనికి తోడు.. ఈసారి ఎన్నికల్లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ ఇద్దరు కొడుకులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించటంతో వారిలో ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమన్నమాట వినిపించింది.

మరోవైపు.. లాలూ కుమార్తెకు డిఫ్యూటీ సీఎం పదవి కోసం లాలూ రాయబారం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇద్దరు కొడుకులకు మంత్రి పదవులు.. కుమార్తెకు డిప్యూటీ సీఎం పదవి అన్న అంచనాల నేపథ్యంలో నితీశ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ మొదలైంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. లాలూ కుమార్తెకు కాకుండా.. ఇద్దరు కుమారులు తేజస్వి యాదవ్.. తేజ్ ప్రతాప్ యాదవ్ లకు మంత్రివర్గంలో స్థానం దక్కటమే కాదు.. చిన్నవాడైన తేజస్వికే డిఫ్యూటీ సీఎం పదవి ఖాయమని చెబుతున్నారు. మరి.. ఈ అంచనాలు నిజం కానున్నాయా? లేదా? అన్నది ఒక ప్రశ్న అయితే.. కూటమిలో భాగస్వామి అయిన పార్టీల్లో ఎవరికి ఎన్ని మంత్రి పదవులు లభిస్తాయన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది.