Begin typing your search above and press return to search.

ఆమె శాపం..మాజీ సీఎం కుటుంబాన్ని వేధిస్తోంది

By:  Tupaki Desk   |   20 July 2017 10:48 AM IST
ఆమె శాపం..మాజీ సీఎం కుటుంబాన్ని వేధిస్తోంది
X
బీహార్ మాజీ సీఎం - ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌ పై భారతదేశంలో తొలిసారి లింగమార్పిడి చేయించుకున్న మాజీ ఎమ్మెల్యే షబ్నం మౌసీబానో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తనను ఎన్నికల్లో మోసం చేయడంతోనే ఆయన కుటుంబసభ్యులు చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు. తన శాపం తగలడంతోనే లాలూ మొదటిసారిగా గడ్డి కుంభకోణంలో, ఇప్పుడు ఆయన భార్య రబ్రీదేవి - కుమారుడు తేజస్వీ యాదవ్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. మోసం చేసిన వారు ఎవ‌రైనా కాలం వారికి త‌గిన గుణ‌పాఠం చెప్తుంద‌ని ష‌బ్నం ఆరోపించారు.

2008లో మధ్యప్రదేశ్‌ లోని కోట్మా నియోజకవర్గం ఎన్నికల్లో లాలూ ప్రసాద్ తనకు ఆర్థికంగా సహాయం చేస్తానని, ప్రచార సమయంలో భరోసా ఇచ్చారని, అనంతరం ఆయన తన హామీని విస్మరించారని మాజీ ఎమ్మెల్యే షబ్నం మౌసీబానో మండిపడ్డారు. లాలూ వల్లే ఎన్నికల్లో ఓడిపోయానని, కేవలం 560 ఓట్లు మాత్రమే వచ్చాయని షబ్నం ఆవేదన వ్యక్తం చేశారు. తనతోపాటు యూపీ - బీహార్ ఓటర్లను కూడా ఆయన మోసం చేశారని విమర్శించారు.

ఇదిలాఉండ‌గా...బీహార్‌ లో అధికార కూటమిలోని ప్రధాన పక్షాలయిన జనతాదళ్ (యునైటెడ్) - రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌ జెడి)ల మధ్య విభేదాలకు తాత్కాలికంగా తెరపడినట్లు తెలుస్తోంది. ఆర్‌ జేడీ అధినేత - మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ కుటుంబ సభ్యుల అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌ ను ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయమని జెడి (యు) అధ్యక్షుడు కూడా అయిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కోరడం, అందుకు నాలుగు రోజుల డెడ్‌ లైన్ విధించడం తెలిసిందే. అయితే తానెలాంటి తప్పూ చేయలేదని, అందువల్ల రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేజస్వి యాదవ్ తేల్చి చెప్పడంతో రెండు పార్టీల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.

ఈ నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి తేజస్వి యాదవ్ కూడా హాజరయ్యారు. ఈ ఇద్దరు నేతలు ఏమి చర్చించుకున్నారనే విషయం స్పష్టంగా తెలియరాలేదు కానీ, మీడియాలో వచ్చిన కథనాలే గనుక నిజమైన పక్షంలో ఇరువురు నేతలు రాజీకి వచ్చారని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవద్దని తేజస్వి యాదవ్‌ కు నితీశ్ చెప్పినట్లు జీ న్యూస్ చానల్ కథనం పేర్కొంది.

కాగా, ఈ సమావేశంలో తేజస్వి యాదవ్ ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న ఆరోపణలపై ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దాదాపు 50 నిమిషాలపాటు జరిగిన కేబినెట్ భేటీకి లాలూప్రసాద్ మరో కుమారుడు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ సింగ్ - రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చౌధరి కూడా హాజరయ్యారు. ఆర్‌ జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్ - ఆయన కుటుంబ సభ్యులకు సంబంధం ఉన్న ఆస్తులపై సీబీఐ దాడులు నిర్వహించి తేజస్వి యాదవ్‌ పై ఎఫ్‌ ఐఆర్ నమోదు చేసినప్పటినుంచి బీహార్‌ లో అధికారంలో ఉన్న మహా సంఘటన్‌ లో విభేదాలు తలెత్తడం తెలిసిందే.