Begin typing your search above and press return to search.

కూతురు కోసం లాలూ కిరికిరి మొదలు

By:  Tupaki Desk   |   10 Nov 2015 6:55 AM GMT
కూతురు కోసం లాలూ కిరికిరి మొదలు
X
బీహార్ ఎన్నికల వ్యవహారం పూర్తి అయ్యింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మహాకూటమి అద్భుత విజయాన్ని సాధిస్తే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే దారుణంగా విఫలం కావటం తెలిసిందే. ఓడిన బాధలో మోడీ పరివారం మునిగిపోతే.. ఘన విజయం సాధించిన నితీశ్ సంతోషంగా ఉండాలి. అయితే.. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ పుణ్యమా అని నితీశ్ కు అప్పుడు ఇబ్బందులు మొదలయ్యాయని చెబుతున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ తో భాగస్వామ్యం అంటే అంత తేలిక కాదన్న విషయం తెలిసిందే అయినా.. నితీశ్ లాంటి నేత లాలూను కంట్రోల్ చేస్తారన్న మాట వినిపించింది.

కానీ.. పరిస్థితి చూస్తుంటే.. అలాంటిదేమీ కనిపించటం లేదు. ఎందుకంటే.. బీహార్ ఫలితాలు విడుదలై 48 గంటలు కూడా పూర్తి కాకముందే.. లాలూ మార్క్ కిరికిరి షురూ అయ్యిందని చెప్పొచ్చు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ ప్రాతినిధ్యం వహించే జేడీయూ కంటే కూడా లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ తొమ్మిది సీట్లు అధికంగా గెలవటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.

లాలూకు పెరిగిన బలం నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఆయన పార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. లాలూ కూడా ఇదే కోరికను కోరుతున్నారు. కానీ..ఇక్కడ ఇబ్బందేమిటంటే.. ఉప ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన ఎంచుకున్న వ్యక్తి నితీశ్ కు ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. విలువలకు ప్రాధాన్యత ఇచ్చే నితీశ్ వైఖరికి భిన్నంగా ఉంటే లాలూ ఉప ముఖ్యమంత్రి పదవి కోసం తన కుమార్తె మీసా భారతికి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారట. ఇప్పటికే ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు కొడుకులకు కీలక మంత్రి పదవులు ఇవ్వాలని కోరుతున్న లాలూ.. అసెంబ్లీ బరిలో దిగని కుమార్తె మీసా భారతికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరటం.. తప్పనిసరి అన్న మాట బలంగా వినిపించటంతో నితీశ్ కు కొత్త తలనొప్పులు షురూ అయినట్లుగా చెబుతున్నారు.

కుమార్తె మీసాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇప్పించి.. ఆర్నెల్ల లోపు ఎవరో ఒకరి చేత రాజీనామా చేయించి.. ఉప ఎన్నికల్లో తన కుమార్తెను బరిలోకి దింపాలన్నది లాలూ ప్రయత్నంగా చెబుతున్నారు. ముందు నుంచి వినిపిస్తున్న అంచనాలకు తగ్గట్లే లాలూ వ్యవహారశైలి ఉండటంతో నితీశ్ వర్గానికి ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో లాలూ ఇంకెలాంటి కోరికలు కోరతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.