Begin typing your search above and press return to search.

మోడీకి దెబ్బేసేందుకు ఆరుపార్టీలు ఏకం

By:  Tupaki Desk   |   8 Jun 2015 2:04 PM GMT
మోడీకి దెబ్బేసేందుకు ఆరుపార్టీలు ఏకం
X
మరో మూడు నెలల వ్యవధిలో బీహార్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ వైఫల్యంతో మాంచి కాక మీదున్న మోడీ.. బీహార్‌లో బీజేపీకి పగ్గాలు ఇప్పించటం ద్వారా తనకు తిరుగులేదన్న సంకేతాల్ని పంపాలనుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మోడీని దెబ్బేయటం ద్వారా.. అధికార ఎన్డీయే సర్కారుకు షాక్‌ ఇచ్చేందుకు బీహార్లో ఆరు పార్టీలు ఏకం అయ్యాయి.

బీహార్‌ సీఎం పదవిని చేపట్టాలని గత కొంతకాలంగా తపిస్తున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. తనకు ముఖ్యమంత్రి పదవికి మించి మోడీని దెబ్బ తీయటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.

ఇందులో భాగంగా.. తాజాగా ఆరు పార్టీలు (ఎస్పీ.. జేడీయూ.. ఆర్జేడీ.. ఎస్‌జేపీ.. జేడీ(ఎస్‌).. ఐఎన్‌ ఎల్‌ డి) కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. తాజాగా సమాజ్‌వాదీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌ ఇంట్లో సమావేశమైన ఈ పార్టీలు కలిసి తమ ఉమ్మడి ముఖ్యమంత్రిగా నితీశ్‌ను ప్రకటించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే. .నితీశ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూటమిలో ప్రతిపాదించింది లాలూ ప్రసాద్‌కావటమే.

చూస్తుంటే.. మోడీని దెబ్బ తీయటం.. ఆయన బలాన్ని తగ్గించేందుకు బీహార్‌ ఎన్నికల్లో తమ విజయమే లక్ష్యంగా భావిస్తోన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆరుపార్టీల కూటమి కలిసి బీహార్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు గతంలో ప్రకటించినప్పటికీ.. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో కాస్తంత విభేదాలు పొడచూపే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. అయితే.. అందుకు భిన్నంగా లాలూ సీఎం పదవికి వెనక్కి తగ్గటం.. నితీశ్‌ను అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో బీహార్‌ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. కూటమిగా అయిపోగానే సరిపోదని.. సీట్ల సర్దుబాటు తలనొప్పులు.. అసంతృప్తులను బుజ్జగించటం లాంటి అగ్నిపరీక్షల్ని.. ఎంత సమర్థంగా ఈ కూటమి ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరి.. బీహార్‌లో మోడీకి ఎలాంటి అనుభవం ఎదురవుతుందో చూడాలి.