Begin typing your search above and press return to search.

ల‌లిత జ్యువెల్ల‌ర్స్ కిర‌ణ్ అంద‌రికీ ఆద‌ర్శ‌మా?

By:  Tupaki Desk   |   18 April 2022 12:30 PM GMT
ల‌లిత జ్యువెల్ల‌ర్స్ కిర‌ణ్ అంద‌రికీ ఆద‌ర్శ‌మా?
X
ఎవ‌రికి డ‌బ్బులు ఊరికే రావు.. బంగారం కొనేముందు నాలుగు షాపుల్లో ధ‌ర చెక్ చేయండి దాన్ని ల‌లిత జువెల్ల‌ర్స్‌లో పోల్చి చూశాకే కొనుగోలు చేయండి.. ఇలా గుండుతో టీవీల్లో, పేప‌ర్ల‌లో ప్ర‌క‌ట‌న‌లిస్తూ ల‌లిత జువెల్ల‌ర్స్ య‌జ‌మాని కిర‌ణ్ ఎంత‌గా ఫేమ‌స్ అయ్యారో అంద‌రికీ తెలిసిందే.

ముఖ్యంగా డ‌బ్బులు ఊరికే రావు అని ఆయ‌న చెప్పిన డైలాగ్ సౌత్ ఇండియాలో ఎంతో ఫేమ‌స్ అయింది. సాధార‌ణంగా జువెల్ల‌ర్స్ య‌జ‌మానులు త‌మ వ్యాపారాన్ని పెంచుకోవ‌డం కోసం సెల‌బ్రిటీల‌కు కోట్ల రూపాయాలు వెచ్చించి ప్ర‌క‌ట‌న‌లు రూపొందిస్తారు. వాటిని బ‌య‌ట‌కు వ‌దిలి ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌ని చూస్తారు. కానీ కిర‌ణ్ మాత్రం త‌న మేధావి త‌నంతో తన వ్యాపార ప్ర‌క‌ట‌న‌ల్లో ఆయ‌నే న‌టించి సెల‌బ్రిటీ అవ‌డం విశేషం.

ఇప్పుడు త‌న ప్ర‌క‌ట‌న‌ల్లో కిర‌ణ్ చెప్పిన డైలాగ్‌లో బ‌య‌ట ప్ర‌జ‌లు కూడా వాడుతున్నారు. ఇక ఇప్పుడు పుష్ఫ సినిమాలోని అల్లు అర్జున్ త‌గ్గేదేలే, కిర‌ణ్ డ‌బ్బులు ఊరికే రావు లాంటి డైలాగ్‌లు రాజ‌కీయాల్లోనూ విరివిగా ఉప‌యోగిస్తున్నారు. ఇటీవ‌ల ఓ ప్రెస్ మీట్‌లో ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ కూడా కిర‌ణ్ డైలాగ్స్ వాడారు.

అంటే అన్ని రంగాల్లోనూ కిర‌ణ్ ఆద‌ర్శంగా మారార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల యూపీ ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా త‌గ్గేదేలే అనే డైలాగ్ రాజ‌కీయ నేత‌ల నోటి నుంచి త‌ర‌చుగా వినిపించింది. ఇక 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ బ‌హుబ‌లి డైలాగ్‌లు చెప్పారు.

మ‌రి ఇప్పుడు డ‌బ్బులు ఊరికే రావంటూ ఆద‌ర్శంగా నిలుస్తున్న కిర‌ణ్ చేస్తున్న‌దేమిటీ? అనే ప్ర‌శ్న‌లు రేకెత్తుతున్నాయి. మ‌రి ఆయ‌న కూడా అమ్మేది బంగార‌మే. అది ఆయ‌న‌కేమీ ఊరికే రాలేదు క‌దా. మిగ‌తా వాళ్ల కంటే త‌క్కువ ధ‌ర‌లు.. త‌క్కువ త‌రుగు.. నాణ్య‌మైన బంగారం ఇస్తున్నామంటూ ఆయ‌న చెబుతున్నారు. కానీ అంతర్జాతీయ మార్కెట్ ప్ర‌కారం అంద‌రికీ ఒక‌టే తరుగు పోతుంది. అలాంటిది ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా త‌క్కువ త‌రుగు ఎలా పోతుంద‌ని అంటున్నారు.

కిర‌ణ్ యాడ్‌లు చూసి ప్ర‌జ‌లు వెళ్లి అక్క‌డ బంగారం కొట్టుకుంటున్నారు. దీంతో ప‌బ్లిసిటీ, వ్యాపారం రెండూ పెరుగుతున్నాయి. కానీ ఆయ‌న కూడా అంద‌రిలాగే వ్యాపారం చేస్తున్నార‌నే విష‌యం తెలుసుకోవాలి. ఎక్క‌డికి వెళ్లినా రూపాయికి వంద పైస‌లే ఉంటాయి కానీ ఎవ‌రూ ఎక్కువ ఇవ్వ‌రు క‌దా అనే సంగ‌తి గుర్తుపెట్టుకోవాలి.