Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ భార‌త‌ర‌త్న‌కు బాబు మోకాల‌డ్డు!

By:  Tupaki Desk   |   29 Dec 2018 8:29 AM GMT
ఎన్టీఆర్ భార‌త‌ర‌త్న‌కు బాబు మోకాల‌డ్డు!
X
టీడీపీ అధినేత - ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడిపై మాజీ సీఎం దివంగ‌త ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీ పార్వ‌తి మ‌రోసారి త‌న‌దైన శైలిలో నిప్పులు చెరిగారు. త‌న భ‌ర్త‌కు చంద్ర‌బాబు వెన్నుపోటు పొడిచిన తీరును గుర్తుచేశారు. ఆయ‌న‌కు భార‌త ర‌త్న అవార్డు రాకుండా బాబే అడ్డుకున్నార‌ని ఆరోపించారు.

రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలోని నీరుకొండ‌లో ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని సుమారు రూ.400 కోట్ల వ్య‌యంతో ఏర్పాటు చేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ల‌క్ష్మీ పార్వ‌తి తాజాగా స్పందించారు. ఆ విగ్ర‌హం ప‌క్క‌నే చంద్ర‌బాబు విగ్ర‌హాన్ని కూడా చిన్న‌గా ఏర్పాటుచేయాల‌న్న‌ది త‌న కోరిక‌గా తెలిపారు. అలా చేసిన‌ప్పుడే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది ఇత‌డేన‌ని ప్ర‌జ‌లు చూసి తెలుసుకుంటార‌ని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ కు దేశ అత్యున్న‌త అవార్డు భార‌త ర‌త్న ద‌క్క‌కుండా చంద్ర‌బాబే మోకాల‌డ్డార‌ని ల‌క్ష్మీపార్వ‌తి ఆరోపించారు. త‌న భ‌ర్త‌కు భార‌త ర‌త్న ప్ర‌క‌టించాలంటూ గ‌తంలో తాను రాష్ట్రప‌తి - ప్ర‌ధాన‌ మంత్రుల‌కు విజ్ఞ‌ప్తి చేసిన సంగ‌తిని గుర్తుచేశారు. ఇదే విష‌య‌మై ఓ సారి మాజీ ప్ర‌ధాని దివంగ‌త అట‌ల్ బిహారీ వాజ్ పేయీని తాను క‌లిశాన‌ని చెప్పారు. ఒక్క‌ త‌మిళ‌నాడుకే ప‌రిమిత‌మైన ఎంజీఆర్ కు భార‌త ర‌త్న ఇచ్చిన‌ప్పుడు ఏపీ ఖ్యాతిని - దేశ ఖ్యాతిని ప్ర‌పంచం న‌లుమూల‌లా చాటిచెప్పిన‌ ఎన్టీఆర్ కు ఇవ్వ‌క‌పోవ‌డం స‌రికాద‌ని ఆయ‌న‌కు నివేదించిన‌ట్లు తెలిపారు.

దీంతో వాజ్‌ పేయీ స్పందిస్తూ.. త‌న‌కు కూడా ఎన్టీఆర్ అంటే అభిమాన‌మ‌ని చెప్పిన‌ట్లు ల‌క్ష్మీపార్వ‌తి తెలిపారు. తామంతా ఎన్టీఆర్ ను ముద్దుగా స్వామీజీ అని పిల్చుకుంటామని కూడా చెప్పార‌న్నారు. ఆయ‌న‌కు భార‌త ర‌త్న ఇచ్చేందుకు తాము సిద్ధ‌మేన‌ని.. అయితే - ఆయ‌న అల్లుడు చంద్ర‌బాబే దానికి అడ్డుప‌డుతున్నార‌ని వాజ్ పేయీ చెప్పినట్లు తెలిపారు. వాజ్ పేయీ నోటి నుంచి నిజం తెలుసుకొని అప్ప‌ట్లో తాను బిత్త‌ర‌పోయాన‌ని పేర్కొన్నారు.

ఆ త‌ర్వాత కూడా చంద్ర‌బాబు దురాగ‌తాలు కొన‌సాగాయ‌ని ల‌క్ష్మీపార్వ‌తి ఆరోపించారు. టీడీపీ స‌మావేశాల్లో ఎన్టీఆర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేయ‌డం మాత్రం బాబు బాగా నేర్చుకున్నాడంటూ ఎద్దేవా చేశారు. ల‌క్ష్మీపార్వ‌తి ముఖ్య‌మంత్రి అవుతోందంటూ ఎన్టీఆర్ కుటుంబీకుల‌ను తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేసి వారిని బాబు పూర్తిగా త‌న అధీనంలోకి తీసుకున్నార‌ని ఆరోపించారు. ముఖ్యంగా హ‌రికృష్ణ కుటుంబానికి ఆయ‌న తీర‌ని ద్రోహం చేశారంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు.