Begin typing your search above and press return to search.

సూటి ప్ర‌శ్నః ఎన్టీఆర్ పై చెప్పులేసిన ఘ‌ట‌న చూపిస్తారా?

By:  Tupaki Desk   |   4 July 2017 2:46 PM GMT
సూటి ప్ర‌శ్నః ఎన్టీఆర్ పై చెప్పులేసిన ఘ‌ట‌న చూపిస్తారా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు.. నంద‌మూరి తార‌క రామారావు గురించి ఎంత గొప్ప‌గా మాట్లాడినా.. ఆయ‌నకు వ్య‌తిరేకంగా కుట్ర ప‌న్ని అధికారం లాక్కున్న సంగ‌తిని ఎవ‌రూ మ‌రిచిపోలేరు. అప్ప‌టి వెన్నుపోటు రాజ‌కీయాలు.. వైస్రాయ్ హోట‌ల్లో ఎన్టీఆర్ మీద చెప్పులేయ‌డం.. అసెంబ్లీలో ఎన్టీఆర్ కు మైక్ కూడా ఇవ్వ‌క‌పోడం.. ఈ విష‌యాలు వేటినీ ఆయ‌న అభిమానులు అంత సులువుగా మ‌రువ‌జాల‌రు. ఎన్టీఆర్ జీవిత క‌థ‌పై సినిమా గురించి ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీ పార్వ‌తి ఈ అంశాల గురించే ప్ర‌స్తావిస్తున్నారు. ఎన్టీఆర్ సినిమాలో అనేక వివాదాస్ప‌ద అంశాల ప్ర‌స్తావ‌న ఉంటుంద‌ని రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో పై అంశాల‌న్నింటినీ సినిమాలో చూపిస్తారా అని ఆమె ప్ర‌శ్నించారు.

వ‌ర్మ ఎన్టీఆర్ మీద తీస్తాన‌ని ప్ర‌క‌టించిన సినిమాలో బాల‌య్యే హీరోనా.. లేక వ‌ర్మ మ‌రో హీరోతో ఈ సినిమా తీయ‌బోతున్నాడా అన్న‌దానిపై స్ప‌ష్ట‌త లేదు. ఐతే వ‌ర్మ ప్ర‌క‌టించిన సినిమాలో బాల‌య్యే హీరో అయితే చాలా అంశాలు మ‌రుగున ప‌డిపోతాయ‌న్న అభిప్రాయాన్ని ల‌క్ష్మీ పార్వ‌తి వ్య‌క్తం చేసింది. ఎన్టీఆర్ రాజ‌కీయ జీవిత విశేషాల్ని కూడా ఈ సినిమాలో చూపించాల‌ని భావిస్తే అందులో బాల‌య్య హీరోగా ఉండ‌క‌పోవ‌డం మంచిద‌ని ఆమె అంటోంది.

ఎన్టీఆర్ సినిమాలో వివాదమైన అంశాలుంటాయ‌ని ఉంటాయని వర్మ చెబుతున్నార‌ని. మ‌రి వైస్రాయ్ హోటల్లో ఎన్టీఆర్ మీద చెప్పులేసిన సంఘటన.. త‌న అల్లుడు తనకు చేసిన అన్యాయంపై ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు.. జెమినీ టీవీలో ఆయన ఇచ్చిన ధర్మపీఠం ఇంటర్వ్యూ.. ఇవన్నీ ఆ సినిమాలో చూపిస్తారా? ఎన్టీఆర్ మీద జరిగిన కుట్రలన్నింటినీ కూడా వర్మ చెప్పగలరా? అలా చెబితే చంద్రబాబు నాయుడు ఊరుకుంటారా? అసలు ముందు బాలకృష్ణ ఊరుకుంటారా? ఇలా కాకుండా వాళ్లకు అనుకూలంగా చెబితే నేను ఊరుకుంటానా? అని లక్ష్మి పార్వతి ప్ర‌శ్నించారు.

వైస్రాయ్ హోట‌ల్ కుట్ర‌లో బాలకృష్ణ కూడా పాత్ర‌ధారి అని ఆరోపించిన లక్ష్మి పార్వతి.. మ‌రి బాల‌య్య‌తో సినిమా తీస్తూ ఇలాంటి నిజాల్ని నిర్భ‌యంగా చూపించ‌గ‌ల‌డా అని సందేహం వ్య‌క్తం చేశారు. ఎన్టీఆర్ మీద సినిమా తీయాల‌నుకుంటే వివాదాల జోలికి వెళ్లొద్ద‌ని తాను బాల‌య్య‌కు సూచించాన‌ని.. వివాదాల మాటెత్తితే బావ చంద్ర‌బాబ‌కు బాల‌య్య స‌పోర్ట్ చేయాల్సి వ‌స్తుంద‌ని.. అలా చేస్తే ఎన్టీఆర్ ఆత్మ శాంతించ‌ద‌ని.. అందుకే వివాదాల జోలికి పోకుండా సినిమా చేయ‌మ‌ని బాల‌య్య‌కు చెప్పిన‌ట్లు ల‌క్ష్మీపార్వ‌తి తెలిపారు.