Begin typing your search above and press return to search.

మహా సీన్ ను తెలంగాణలో అంటూ ఈ మాటలేంది లక్ష్మణ్

By:  Tupaki Desk   |   24 Nov 2019 7:02 AM GMT
మహా సీన్ ను తెలంగాణలో అంటూ ఈ మాటలేంది లక్ష్మణ్
X
చేసింది ఎదవ పని అన్న మాట పలువురి నోట వినిపిస్తుంటే.. దాన్నో రాచకార్యంలా.. ఎవరూ చేయలేని పనిని తాము చేసినట్లుగా గొప్పలు చెప్పుకోవటం దేనికి నిదర్శనం? చేతిలో ఉన్న అధికారంతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోవటం ఇప్పటికైతే నడుస్తుంది కానీ.. దీర్ఘకాలంలో ఎదురుదెబ్బలు తప్పవు. తమ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఎలా చెలరేగిపోయిందో తెలిసిందే. ఇప్పుడా పార్టీ పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అప్పుడెప్పుడో డెబ్భైలలో తాను చేసిన పనినే..ఇంతకాలానికి మరొకరు చేసి చూపించటం ద్వారా శరద్ పవార్ కు నోట మాట రాని పరిస్థితి. అందుకే అంటారు.. ఎదవ పని చేయగానే సరికాదు.. దాని ఫలితాన్ని కూడా అనుభవించాల్సి ఉంటుందని. మహారాష్ట్రలో గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే రాజకీయ చక్రం తిప్పేసి.. తమకు అనుకూలంగా పరిస్థితుల్ని మార్చేసుకున్న వైనాన్ని గొప్పగా కీర్తించుకోవటానికి మించిన దుర్మార్గం మరొకటి ఉండదు.

ఇటీవల కాలంలో ప్రతి విషయానికి చెలరేగిపోయి విమర్శలు చేస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మహారాష్ట్రలో తమ పార్టీ రాజకీయ మెరుపుదాడులు.. అదేనండి మోడీ వారికి అలవాటైన సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని, తెలంగాణలోనూ ఆ పరిస్థితి వచ్చే సమయం దగ్గర్లోనే ఉందంటూ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

మెజార్టీ ఉండి.. ప్రభుత్వాన్ని నడిపిస్తున్నా సరే.. రాత్రికి రాత్రి తాము జరిపే వ్యూహంతో ఏమైనా చేసేస్తాం.. తమకు తిరుగు ఉండదన్న అర్థం వచ్చేలా లక్ష్మణ్ మాటల్ని పలువురు తప్పు పడుతున్నారు. తెలంగాణ ఏమీ మహారాష్ట్ర కాదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో రాజకీయ బాహుబలిగా ప్రచారం చేసుకుంటున్న సీఎం కేటీఆర్.. తన చుట్టూ ఎంతమంది కట్టప్పలు ఉన్నారో చూసుకోవాలన్నారు.

లక్ష్మణ్ చేస్తున్న తాజా వ్యాఖ్యలు మోడీషాల ఇమేజ్ ను దెబ్బ తీసేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తమకున్న పవర్ తో కూలదోస్తామన్న రీతిలో చేస్తున్న బెదిరింపులు బీజేపీకి ఎలాంటి లబ్థి చేకూర్చకపోగా.. ఇప్పుడున్న ఇమేజ్ ను డ్యామేజ్ చేయటం ఖాయమంటున్నారు. మహారాష్ట్రలో చేసినట్లే తెలంగాణలో చేస్తామని చెప్పటం అహంకారానికి ప్రతిరూపమన్నది మర్చిపోకూడదు. ఇలాంటి వాటిని తెలంగాణ సహించలేదన్నది లక్ష్మణ్ లాంటోళ్లు మిస్ కావటమేంటి?