Begin typing your search above and press return to search.

ల‌గ‌డ‌పాటి స‌ర్వే- లాజిక్ మిస్స‌య్యిందే

By:  Tupaki Desk   |   4 Dec 2018 3:20 PM GMT
ల‌గ‌డ‌పాటి స‌ర్వే- లాజిక్ మిస్స‌య్యిందే
X
లగడపాటి రాజగోపాల్ లోక్‌సభ మాజీ సభ్యులు. సమైక్య రాష్ట్రం కోసం లోక్‌సభలోను - రాష్ట్రంలోను పోరాడిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. సభలో పెప్పర్ స్ప్రేతో పత్రికలలో పతాక శీర్షికలకు ఎక్కారు. అత‌ను స‌హ‌జంగా టీఆర్ఎస్ వ్య‌తిరేకి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రతి ఎన్నికలకు లగడపాటి రాజగోపాల్ చేసే సర్వే మరోఎత్తు. లగడపాటి రాజగోపాల్ తన సర్వేలతో తెలుగు రాష్ట్రాలనే కాదు, జాతీయ స్దాయిలో కూడా అన్ని పార్టీల సీనియర్ నాయకులను ఆకట్టుకున్నారు. లగడపాటి చేసే సర్వేల పై ఓ అంచనా కూడా ఉంది. ప్రతి ఎన్నికలకు ముందు తెలుగు ప్రజలు లగడపాటి రాజగోపాల్ సర్వే ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తారు.

తెలంగాణ ముందస్తు ఎన్నికలలో కూడా లగడపాటి రాజగోపాల్ తన సర్వే వివరాలను సీట్ల సంఖ్య చెప్ప‌లేదు గాని మొగ్గు ఎటువైపో ప్రకటించారు. పోలింగ్ ముగిసే వరకూ ఎలాంటి సర్వేలు ప్రకటించకూడదన్న ఎన్నికల కమీషన్ నిబంధన కారణంగా లగడపాటి ఓ జ్యోతిషుడిలా ఫలితాలను ప్రకటించారు. ఈ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్దులు పదిమంది వరకూ గెలుస్తారని ప్రకటించారు. అలాగే తెలంగాణలోని నాలుగు జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని, మూడు జిల్లాలలో తెలంగాణ రాష్ట్ర సమితికి బాగుందని, మిగిలిన జిల్లాలలో హోరాహోరిగా ఉందంటూ జోస్యం చెప్పారు.

అయితే గతంలో లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేలకు భిన్నంగా ఈ సర్వే ఉండటం కాసింత గందరగోళానికి దారితీస్తోంది.

2014 ఎన్నికలలో వచ్చిన స్దానాలే కంటే భారతీయ జనతా పార్టీకి ఈ సారి ఎక్కువ స్దానాలు వస్తాయని లగడపాటి జోస్యం చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది. గత ఎన్నికలలో తెలుగుదేశంతో కలసి పోటీ చేసిన బీజేపీకి 5 స్దానాలే వచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీ ఎవరితోను కలసి పోటీ చేయటం లేదు. అయినా ఆ పార్టీకి ఎక్కువ స్దానాలు వస్తాయని చెప్పిన‌ లగడపాటి సర్వే ఎలా నిజమవుతుందని ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే తెలంగాణ రాజధానికే పరిమితమైన భారతీయ జనతా పార్టీ తెలంగాణ జిల్లాలలో ఎక్కువ సీట్లు ఎలా సాధిస్తుందని ప్రశ్నిస్తున్నారు. పోలింగ్ పూర్తైన తర్వాతే సర్వే వివరాలు వెల్లడిస్తామని చెబుతూనే కొన్ని జిల్లాలలో కాంగ్రెస్‌కు బాగుందని, మరికొన్ని జిల్లాలలో టీఆర్‌ఎస్‌కు బాగుందని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాదులో తొలి నుంచి మజ్లిస్‌కు అనుకూలంగానే ఉంటుందని ఇప్పుడు రాజగోపాల్ చెప్పింది కూడా అదేనని ఇందుకోసం 45 రోజులు సర్వే చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు.