Begin typing your search above and press return to search.

టీడీపీలో లగడపాటి కలకలం...?

By:  Tupaki Desk   |   25 April 2022 2:30 PM GMT
టీడీపీలో లగడపాటి కలకలం...?
X
లగడపాటి రాజగోపాల్. ఆయనకు ఆంధ్ర ఆక్టోపస్ అని బిరుదు ఉంది. జరిగినది కాదు, జరగబోయేది కూడా తనదైన దూర దృష్టితో చూసి ఇట్టే చెప్పేస్తారు అని అంతా అంటారు. ఇక లగడపాటి చెప్పిన రాజకీయ జోస్యాలు గతంలో సూపర్ హిట్ అయ్యాయి. అయితే 2018 తెలంగాణా, 2019 ఏపీ రిజల్ట్ మాత్రం లగడపాటి చెప్పినట్లుగా రాలేదు. సీన్ మొత్తం మారింది. దాంతో ఆయన కూడా తగ్గిపోయారు.

సరే మూడేళ్ళు గడిచాయి. మరో రెండేళ్ళలో ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ రాజధాని అయిన విజయవాడలో హఠాత్తుగా లగడపాటి మెరిసారు. అంతేనా ఆయన వైసీపీ నేతలతో చెట్టపట్టాలు వేసారు. మధ్యలో కాంగ్రెస్ నేతలను కూడా కలిసారు. కానీ మైలవరం ఎమ్మెల్యే వసంత క్రిష్ణప్రసాద్ తో లగడపాటి భేటీయే అన్నింటి కన్నా పొలిటికల్ గా ఆసక్తిని రేపింది.

అదే రాజకీయాల్లో తీవ్ర చర్చకూ దారితీసింది. ఇంకేముంది ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లుగా లగడపాటి వైసీపీలో చేరిపోతారు అని కూడా ప్రచారం సాగింది. అందులో నిజమెంత ఉందో తెలియదు కానీ టీడీపీ శిబిరం మాత్రం ఈ ప్రచారం మీద కలవరపడుతోంది. లగడపాటి మావాడు అని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

ఆయన ఏపీ రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇవ్వాలీ అంటే ఏకైక ఆప్షన్ టీడీపీ మాత్రమేనని కూడా తమ్ముళ్ళు బల్లగుద్దుతున్నారు. లగడపాటి తెలివైన రాజకీయ నాయకుడు. ఆయన ఏరి కోరి వైసీపీలో ఎందుకు చేరుతారు, వైసీపీ మునిగిపోయే పడవ లాంటిది. ఇక వైఎస్సార్ తో లగడపాటిది గురు శిష్యుల సంబంధం. అదే జగన్ తో ఆయనది ఉప్పూ నిప్పూ లాంటి వ్యవహారం.

అందువల్ల లగడపాటి ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీలో చేరరు కాక చేరరు అని తమ్ముళ్ళు అంటున్నారు. అమరావతి రాజధానికి ఒక కులం పేరు మీద బదనామ్ చేసి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, అలాగే ఏపీలో ఎక్కడా అభివృద్ధి లేదని, ఇక తాజా మంత్రి వర్గ విస్తరణలో బలమైన కొన్ని సామాజిక వర్గాలను పక్కన పెట్టేశారని, పరిస్థితి ఇలా ఉంటే లగడపాటి ఎలా వైసీపీలో చేరుతారు అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

లగడపాటి లాంటి వారు వైసీపీలో చేరినా జనాల వద్దకు వెళ్ళి వైసీపీ పాలన బాగుందని చెప్పి ఎలా ఓట్లు అడగలరని కూడా వారు అంటున్నారు. ఇక లగడపాటి ఆదివారం ఖమ్మం వెళ్లారు. అక్కడ ఆయన కొందరు టీడీపీ నేతలను కూడా కలిశారని చెబుతున్నారు.

ఏపీలో రాజకీయ మార్పు రావడం తధ్యమని, వచ్చేది టీడీపీ ప్రభుత్వమే లగడపాటి అన్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి చూస్తే లగడపాటి నోరు విప్పి ఏదీ చెప్పలేదు. ఆయన వైసీపీ నేతలను కలవడం మాత్రమే మీడియాలో వచ్చింది. ఇక టీడీపీ నేతలనూ ఆయన కలిశారని చెబుతున్నా అది బయటకు రాలేదు.

ఇవన్నీ చూస్తే ఒకటి మాత్రం అర్ధమవుతోంది. లగడపాటి ఉంటే మా పార్టీలోకి వచ్చి పోటీ చేయాలి. లేకపోతే అలా రాజకీయాలకు దూరంగా ఉండాలి. అంతే తప్ప ఆయన వైసీపీలో చేరకూడదు అని టీడీపీలో కరడు కట్టిన ఒక సెక్షన్ అయితే గట్టిగానే భావిస్తోందిట. మరి లగడపాటి అంత పనీ చేస్తారా. ఏపీలో బద్ధ శతృవుల మాదిగా ఉన్న వైసీపీ టీడీపీలో ఆయన వైసీపీని ఎంచుకుంటారా. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఏపీ రాజకీయాల్లో అంతకంటే సంచలనం అన్నది వేరొకటి లేదు అని చెప్పకతప్పదు.