Begin typing your search above and press return to search.

బాబుకు క్ష‌మాప‌ణ చెప్పాలి: రేవంత్ కు ర‌మ‌ణ మెసేజ్‌

By:  Tupaki Desk   |   26 Oct 2017 10:40 AM GMT
బాబుకు క్ష‌మాప‌ణ చెప్పాలి: రేవంత్ కు ర‌మ‌ణ మెసేజ్‌
X
సొంత పార్టీ నేత‌ల‌పైనే విమ‌ర్శ‌లు గుప్పించిన త‌ర్వాత‌ టీటీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ - కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి వ‌రుస‌గా ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. పార్టీ క‌ట్టుబాట్ల‌ను విస్మ‌రించి త‌మ పార్టీ నేత‌ల‌పైనే బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేయ‌డంతో పార్టీ అధిష్టానం రేవంత్ పై చ‌ర్య‌లు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే టీటీడీఎల్పీ ఫ్లోర్ లీడ‌ర్ ప‌ద‌విని రేవంత్ కోల్పోయారు. ఈ నేప‌థ్యంలో రేవంత్ కు టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్ ర‌మ‌ణ పంపిన సందేశ‌మొక‌టి హాట్ టాపిక్ గా మారింది. ఈ రోజు నిర్వహించబోతోన్న తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ సమావేశానికి హాజ‌రుకావ‌ద్ద‌ని కోరుతూ రేవంత్ కు ర‌మ‌ణ మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ్డందుకుగానూ టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుకు రేవంత్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ర‌మ‌ణ చెప్పిన‌ట్లు సమాచారం.

ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ స్పీక‌ర్‌ ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన బీఏసీ స‌మావేశానికి టీటీడీపీ త‌ర‌పున ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య హాజ‌ర‌య్యారు. వాస్త‌వానికి ఆ స‌మావేశానికి టీటీడీఎల్పీ ఫ్లోర్ లీడ‌ర్ హోదాలో రేవంత్ రెడ్డి హాజ‌రుకావాల్సి ఉంది. సొంత‌పార్టీపైనే విమ‌ర్శ‌లు గుప్పించి, కాంగ్రెస్ లోకి వెళ్ల‌బోతున్న‌ట్లు రేవంత్ సంకేతాలివ్వ‌డంతో ఆయ‌న‌ను ఆ ప‌ద‌వినుంచి తొల‌గిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై టీటీడీపీకి సంబంధించిన స‌మావేశాల‌కు హాజ‌రుకావ‌ద్ద‌ని రేవంత్ కు ఆదేశాలు జారీ అయిన‌ట్లు తెలుస్తోంది. రేవంత్ క్ర‌మ‌శిక్ష‌ణను ఉల్లంఘించ‌డంతో ఆయ‌న‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధిష్టానం భావిస్తోంది. టీటీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి నుంచి కూడా రేవంత్ ను త‌ప్పించ‌వ‌చ్చని టీడీపీ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఒక‌వేళ రేవంత్ పార్టీలో కొన‌సాగాల‌నుకుంటే ఏ హోదా లేకుండా, కేవ‌లం ఎమ్మెల్యేగా కొన‌సాగ‌మ‌ని అధిష్టానం సూచించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న త‌ర్వాత ఆయ‌న‌తో భేటీ అయి అన్ని విష‌యాల‌ను వివ‌రించాల‌ని రేవంత్ భావించారు. అయితే, తాజా పరిణామాల నేప‌థ్యంలో రేవంత్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.