Begin typing your search above and press return to search.

గెలిస్తే ‘ఈవీఎం’ ట్యాంపరింగ్ లేనా తమ్ముడు?

By:  Tupaki Desk   |   17 Feb 2016 5:33 AM GMT
గెలిస్తే ‘ఈవీఎం’ ట్యాంపరింగ్ లేనా తమ్ముడు?
X
తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో వరసపెట్టి మరీ టీఆర్ ఎస్ చెలరేగిపోవటమేకాదు.. తన సత్తా చాటుతూ ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్న పరిస్థితి. ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస ఎన్నికల్లో.. విపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా.. సాధిస్తున్న విజయాలు విపక్షాలకు ముచ్చెమటలు పోయిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఎన్నికల ఫలితాలు వెలువడిన ప్రతిసారీ ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుందంటూ విపక్షాలు విరుచుకుపడటం ఒక అలవాటుగా మారింది.

ఒకవేళ అలాంటి పరిస్థితే ఉంటూ.. సాంకేతికంగా ఉన్న లోపాల్ని పక్కాగా చూపించటం.. ట్యాంపరింగ్ లకు పాల్పడిన ఆధారాల్ని ప్రదర్శించటంతో పాటు.. అధికారపార్టీ దుర్మార్గాన్ని బయట పెట్టేలా చేస్తే బాగుంటుంది. అది వదిలేసి.. విమర్శలతో కాలం వెళ్లబుచ్చటం మంచి పద్ధతి కాదు. గెలిచిన ప్రతిసారీ అధికార పార్టీ ట్యాంపరింగ్ లకు పాల్పడుతుందన్న వ్యాఖ్యను ప్రజలు ఆమోదించే పరిస్థితి ఉండదు. నిజంగా అలాంటి పరిస్థితే ఉంటే.. దేశంలో అధికార పార్టీలు తప్పించి మిగిలిన వారు ఎవరూ విజయం సాధించలేరు.. అధికారాన్ని చేజిక్కించుకోలేరు.

ఒకవేళ దేశంలో ఎక్కడా లేని విచిత్రమైన పరిస్థితి తెలంగాణలో ఉన్నాయని భావిస్తే.. అందుకు తగ్గ పక్కా ఆధారాల్ని చూపించి విమర్శలు చేయాలే తప్పించి.. అలా ఫలితాలు వెలువడటం.. ఇలా విమర్శలతో దాడి చేయటం వల్ల విపక్షాలకే నష్టమన్న విషయాన్ని గుర్తించాలి. తాజాగా నారాయణ ఖేడ్ ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి విజయం పట్ల తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన ఫిర్యాదును చూస్తే.. టీడీపీ బలంగా ఉన్న గ్రామాల్లో ఏక సంఖ్యలోనే ఓట్లు వచ్చాయని ఆరోపిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితి ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లనే ఎందుకు..? ప్రజల్లో కూడా మార్పు వచ్చిందేమో? ప్రజలు పార్టీని తిరస్కరిస్తున్నారేమో?లాంటి ప్రశ్నలు వేసుకొని అంతర్మధనం చెందాల్సింది పోయి.. పక్కా ఆధారాలు చూపించకుండా ఆరోపణలు చేయటం బాగోదన్న మాట వినిపిస్తోంది. కంప్లైంట్ చేసేటప్పుడు కాస్త ముందు వెనుకా చూసుకుంటే బాగుంటుందేమో తమ్ముడు..?