Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాటకు గ్రేటర్ ప్రజలపై 2వేల కోట్ల భారం

By:  Tupaki Desk   |   23 Jan 2016 4:47 AM GMT
కేసీఆర్ మాటకు గ్రేటర్ ప్రజలపై 2వేల కోట్ల భారం
X
గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల మధ్య నడిచే విమర్శల జడివానతో కొత్త కొత్త అంశాలు బయటకు వస్తుంటాయి. తమ ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టేందుకు వీలుగా రాజకీయ పక్షాలు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తుంటాయి. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ అధికారపక్షంపై విపక్షాలు విమర్శల దాడిని షురూ చేశాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణయాల కారణంగా ప్రజల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందంటూ తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని మెట్రో ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించిన వైఖరి కారణంగా హైదరాబాదీయులపై రూ.2వేల కోట్ల భారం పడిందని ఆరోపించారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రమణ. మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం కావటంతో రూ.2వేల కోట్ల భారం నగర ప్రజలపై అంతిమంగా పడుతుందని లెక్క కట్టారు.

పాత అలైన్ మెంట్ ప్రకారమే పనులు జరగాలని తాము అఖిలపక్ష సమావేశంలో చెప్పామని.. కానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ మాట వినలేదన్నారు. కొత్తదారిలో కడతామని చెప్పిన ఆయన.. ఇప్పుడు పాత అలైన్ మెంట్ ప్రకారమే నిర్మిస్తున్నారన్న విషయాన్ని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రతిమాటా ఇదే రీతిలో ఉంటుందని విమర్శించారు. కేసీఆర్ మాటల కారణంగా ప్రజల మీద అంతిమంగా భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల సమయంలో మూసీ సుందరీకరణ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని 20 నెలల పాలనలో నగరం మొత్తాన్ని మూసీ చేసేశారంటూ తీవ్రంగా మండిపడ్డారు. లెక్కలు చెప్పి మరీ కేసీఆర్ పై చేస్తున్న విమర్శలకు గ్రేటర్ ప్రజలు ఎంత వరకూ స్పందిస్తారో చూడాలి.