Begin typing your search above and press return to search.

కేసీఆర్ కంట్లో పడిన ఆ జంపింగ్ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   7 Aug 2022 7:30 AM
కేసీఆర్ కంట్లో పడిన ఆ జంపింగ్ ఎమ్మెల్యే
X
నీతులు ఎవరైనా చెప్పేస్తారు. కానీ.. అందుకు తగ్గట్లుగా నడవటంలోనే సమస్యలన్ని. కేంద్రంలోని మోడీ సర్కరుపై అదే పనిగా విరుచుకుపడటమే పనిగా పెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఆసక్తికరంగా మారింది. ఒక్కో సీజన్ లోఆయన ఒక్కో నేతను హైలెట్ చేస్తుంటారన్న ప్రచారం సాగుతూ ఉంటుంది. తాజాగా మంత్రి వర్గంలో అంత మంది మంత్రులు ఉన్నా.. పార్టీకి చెందిన సీనీయర్ నేతల్ని.. ఉద్యమ కాలం నుంచి తన పక్కనే ఉండి పార్టీకి సేవ చేసిన వారి కంటే కూడా.. ఉద్యమంలో వెన్ను చూపించిన వారికి టీఆర్ఎస్ లో పెద్దపీట వేసి పెట్టారన్న విమర్శను సీఎం కేసీఆర్ తరచూ ఎదుర్కొంటూ ఉంటారు.అయినప్పటికీ దానికి సంబంధించిన సమాధానాన్ని ఆయన ఇచ్చింది లేదు.

ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో ఎల్ బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయంసాధించిన సుధీర్ రెడ్డి.. తర్వాతి కాలంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవటం తెలిసిందే. అనంతరం ఆయన మూసీ రివర్ ఫ్రంట్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను తెగ పొగిడేయటమే కాదు.. తమ ప్రాజెక్టు కోసం మూడేళ్ల వ్యవధిలో దాదాపు రూ.12వేల కోట్లకు పైనే కేటాయిస్తారని.. హైదరాబాద్ దశ.. దిశ మారిపోతుందన్న మాట ఆయన నోటి నుంచి తరచూ వినిపిస్తూ ఉండేది.

అయితే.. ఆయన మాటలకు తగ్గట్లు నిధులు ఏమీ విడుదల కాలేదు. ఆయన చెప్పినట్లుగా మూసీని మార్చింది లేదు. ఆ తర్వాత నుంచి ఆయన పెద్దగా కనిపించింది లేదు. కాకుంటే.. ప్రగతిభవన్ లో జరిగే ప్రత్యేక రివ్యూల కోసం మాత్రం తనను పిలుస్తుంటారని తన సన్నిహితులతో చెప్పేవారు. కానీ.. బయట మాత్రం సీఎం కేసీఆర్ తో కానీ.. మంత్రి కేటీఆర్ తో కానీ పెద్దగా కనిపించింది లేదు.

అలాంటి ఆయన.. మొన్నటికి మొన్న ఢిల్లీకి వెళ్లి దాదాపు వారానికి పైనే ఉన్న వేళలో.. హైదరాబాద్ నుంచి వెళ్లిన ప్రత్యేక విమానంలో చోటు దక్కించుకున్న అతి కొద్ది మందిలో సుధీర్ రెడ్డి ఒకరు. సీఎం కేసీఆర్ తో పాటు అక్కడే ఉన్న ఆయన.. తనకున్న ఢిల్లీ పరిచయాల్ని సమయానుకూలంగా కేసీఆర్ అవసరాల కోసం వినియోగించినట్లు చెబుతారు. కొద్ది నెలల వ్యవధిలోనే సీఎం కేసీఆర్ కు సన్నిహితుల జాబితాలో సుధీర్ రెడ్డి చేరినట్లుగా చెబుతుంటారు. అనతి కాలంలోనే కేసీఆర్ మనసును దోచుకున్న జంపింగ్ ఎమ్మెల్యేల్లో సుధీర్ రెడ్డికి ప్రత్యేక స్థానం ఉందంటారు. ఇందుకు నిదర్శనంగా తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలోనూ ఆయనకు మొదటిసారి మంత్రి హరీశ్ రావు పక్కన కూర్చునే అవకాశం దక్కింది. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహిత ఎమ్మెల్యేల్లో సుధీర్ రెడ్డి నిలిచినట్లుగా చెబుతున్నారు.