Begin typing your search above and press return to search.

ఆరంభంలో హడల్.. ఆఖర్లో హల్ చల్.. ముంబై విక్టరీ

By:  Tupaki Desk   |   2 Oct 2020 9:00 AM IST
ఆరంభంలో హడల్.. ఆఖర్లో హల్ చల్.. ముంబై విక్టరీ
X
ముంబై ఇండియన్స్ మరో సారి అదరగొట్టింది. 48 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ పై ఘనవిజయం సాధించింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(70; 45 బంతుల్లో 8×4, 3×6) మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడగా.. అతడికి తోడుగా పొలార్డ్(47 నాటౌట్‌; 20 బంతుల్లో 3×4, 4×6), హార్దిక్ (30 నాటౌట్‌; 11 బంతుల్లో 3×4, 2×6) మెరుపు బ్యాటింగ్ తో ముంబై 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన పంజాబ్ బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ముంబై బౌలర్లు పాటిన్సన్(2/28), బుమ్రా (2/18), చాహర్(2/26) వరుసగా వికెట్లు తీయడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులే చేయగలిగింది. ఫామ్ లో ఉన్న రాహుల్(17), మయాంక్ అగర్వాల్(25) స్వల్ప స్కోర్లకే పరిమితం కాగా మాక్స్‌వెల్‌ మరోసారి నిరాశ పరిచాడు. నికోలస్ పూరన్‌ మాత్రమే (44; 27 బంతుల్లో 3×4, 2×6) కాసేపు మెరుపులు మెరిపించాడు.

ఆఖరాట అదుర్స్

మ్యాచ్ లో మొదటి 10 ఓవర్లు ముంబై వికెట్లు కాపాడుకోడానికే ప్రాధాన్యత ఇవ్వగా.. ఆఖరి పది ఓవర్లలో బౌలర్లను ఊచకోత కోశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 45 బంతుల్లో 70 పరుగులు చేసి ఔట్ అవగా ఆఖర్లో హార్దిక్ పాండ్యా, కీరన్ పోలార్డ్ సునామీ సృష్టించారు. పోలార్డ్ 20 బంతుల్లో 47 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో నాలుగు సిక్సర్లు.. మూడు ఫోర్లు ఉన్నాయి. హార్దిక్ పాండ్యా కూడా చివర్లో మెరుపులు మెరిపించాడు. 11 బంతుల్లో 30 పరుగులు చేశాడు.. 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదేశాడు. దీంతో ముంబై స్కోరు 20 ఓవర్లు ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ముంబై జట్టు ఆఖరి 6 ఓవర్లలో 104 పరుగులు చేసిందంటే పోలార్డ్, పాండ్యా ఎంతటి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

ఒక బ్యాట్స్ మెన్ ఇద్దరు ఫీల్డర్ల క్యాచ్

18వ ఓవర్లో షమీ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్ మొదటి బంతిని రోహిత్ లాంగ్ ఆఫ్ దిశగా సిక్స్ గా మలిచే ప్రయత్నం చేశాడు రోహిత్ బాదిన బంతి గాలిలో బౌండరీ వైపు వేగంగా వెళుతోంది. ఈలోగా బౌండరీ లైన్ వద్ద వున్న మ్యాక్స్‌వెల్ పరిగెత్తుకుంటూ వచ్చి గాల్లో ఎగిరి బౌండరీ లైన్ కు సరిగ్గా కొద్దిగా ముందు క్యాచ్ పట్టాడు. అయితే క్యాచ్ పట్టే క్రమంలో పట్టు కోల్పోయాడు. బౌండరీ లైన్ దాటి అవతల వైపు పడిపోబోయాడు. సరిగ్గా ఆ సమయంలో సమయస్ఫూర్తితో బంతిని అప్పుడే అక్కడికి పరిగెత్తు కుంటూ వచ్చిన ఫీల్డర్ నీషాం వైపు విసిరేశాడు. నీషాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా లేకుండా బంతిని ఒడిసి పట్టుకున్నాడు. దీంతో రోహిత్ శర్మ నిరాశగా వెనుదిరిగాడు.

రోహిత్ శర్మ సూపర్ రికార్డు

ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో 5 వేల పరుగుల మార్కు అందుకున్న మూడో క్రికెటర్​గా నిలిచాడు. ఈ రికార్డు సాధించిన విరాట్‌ ​కోహ్లీ, సురేశ్‌ రైనా తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్​ కు ముందు 4,998 పరుగులతో ఉన్న రోహిత్‌.. పంజాబ్ ​తో జరిగిన మ్యాచ్​ లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఫోర్ బాది 5 వేల పరుగుల మార్కును చేరుకున్నాడు.విరాట్‌ కోహ్లీ 180 మ్యాచ్​ల్లో 5,430 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, రైనా 193 మ్యాచ్​ల్లో 5,368 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్​ 191 మ్యాచ్ లు ఆడి ఐదు వేల పరుగుల క్లబ్ లో చేరాడు.