Begin typing your search above and press return to search.

నారా కాదు నాటకాల చంద్రబాబునాయుడు

By:  Tupaki Desk   |   8 Feb 2019 4:57 PM GMT
నారా కాదు నాటకాల చంద్రబాబునాయుడు
X
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాలుగున్నరేళ్ల తన పాలనలో స్వార్థం కోసం చంద్రబాబు ఎన్నో నాటకాలు ఆడారన్నారాయన. సమైక్యాంధ్ర ఉద్యమం లో బుక్ చేసిన కేసులను ఎత్తి వేసినందుకు చంద్రబాబును అభినందిస్తూనే ఆయన అంతేస్థాయిలో విమర్శలూ గుప్పించారు.

చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దనడానికి - కావాలనడానికి.. ఎన్డీయేలో ఉండడానికి, అందులోంచి బయటకు వచ్చేయడానికి అన్నిటికీ ఆయన స్వార్థ ప్రయోజనాలే కారణమని, అంతేకానీ, ఆయన చెబుతున్నట్లు అందులో రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ లేవన్నారు. ఈ మేరకు చంద్రబాబును ఎండగడుతూ ఆయన బహిరంగ లేఖ కూడా రాశారు. ఆ లేఖలో ఆయన చంద్రబాబుపై ప్రశ్నలు - వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘‘విభజన హామీల విషయంలో బీజేపితో కలిసి నడిస్తే ఎన్నికలలో మీ పుట్టి మునగడం ఖాయమని అర్థం చేసుకుని, బీజేపీతో పొత్తు తెంచుకోవాలని నిర్ణయించుకుని... ప్రత్యేకహోదా కావాలని మెల్లమెల్లగా మీరు స్వరం విప్పుతున్నప్పుడే గత సెప్టెంబర్ 23న నేను లేఖ రాస్తూ ప్రత్యేక హోదా ఉద్యమకారులపై మీరు బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేసిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన మొదటి రోజు నుంచి బీజేపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ కు న్యాయంచేయవలసిన అన్ని విషయాలలో రకరకాల సాకులు వెదుకుతూ కాలం వెళ్ళబుచ్చడం.. దానికి మీ నేతృత్వం లోని రాష్ట్రప్రభుత్వం డూడూ బసవన్నలా తలూపడం అందరికీ తెలిసిందే’’నంటూ చంద్రబాబును ఆయన ఎండగట్టారు.

విభజన వల్ల ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి అప్పటి యుపిఎ కాబినెట్ తీసుకొన్న ప్రత్యేకహోదా నిర్ణయాన్ని అమలుపరచాలని సూచిస్తూ సోనియా గాంధీ 02.06.2014 న ఒకటి 19.02.2015 న ఒకటి రెండు లేఖలు రాశారు. ఇక జూన్ 2015 లోనే 9 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్ర కు ప్రత్యేకహోదా ఇవ్వమని తీర్మానం చేసి కేంద్రానికి ఇచ్చారు. 19.10.2015 న రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారికి ఆంధ్ర కు ప్రత్యేకహోదా ఇవ్వమని లెటర్ రాశారు.. మార్చ్ 2016 లో ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా కోసం కోటి సంతకాలు సేకరించి తెస్తే.. దాని కోసం ఢిల్లీ ఏఐసిసి కార్యాలయంలో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి..దానిమీద సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ సైతం సంతకాలు చేసి కేంద్రానికి పంపిన సంగతి మీకు గుర్తువుండే వుంటుంది. రాజధాని విషయంలో ఢిల్లీ నుంచి పిడికెడు మట్టి, చెంబెడు నీళ్ళు ఇచ్చి చేతులు దులుపుకొన్న మోడీ గారికి.. రాష్ట్రంలో మూలమూలల నుంచి మట్టి - నీళ్ళు సేకరించి పంపి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుపున నిరసనను తెలియచేసింది కాంగ్రెస్ పార్టీ. ఆంధ్ర కు ప్రత్యేకహోదా కోరుతూ నేను రాజ్యసభలో ప్రైవేట్ మెంబెర్ బిల్ ప్రవేశపెట్టి, దానిపై వోటింగ్ జరిగే పరిస్థితి వచ్చినప్పుడు దానిపై దాదాపు 14 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడంతో పాటు, పార్లమెంట్ చరిత్ర లో ఎన్నడులేని విధంగా ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ కు మద్దతుగా రెండు సార్లు విప్ జారి చేసి..ఈ బిల్లుకు మద్దతు ఇవ్వవలసినదిగా తమ సభ్యులకు నిర్దేశించి కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్దిని నిరూపించుకొంది. కనీసం అప్పుడు కూడా మీరు కళ్ళు తెరిచి వాస్తవం గ్రహించలేదు.

మొన్న మొన్నటి దాకా.. మోడీ గారిని ఎవరైనా ఏమైనా అంటే గుండెల్లో గునపం గుచ్చుకొన్నట్లు విలవిలలాడి, మోడీ గారి పై ఈగలు ఏమైనా వాలితే ఆయన ఇబ్బంది పడతారని ఆయన చుట్టూ విసన కర్రలు పట్టుకొని తిరిగిన మీరు..ఎన్నికల పుణ్యాన ప్రజలను నమ్మించాలనే ప్రయత్నంలో.. ఆయనపై కళ్ళు ఎర్రచేసి.. ఇప్పుడు మోడీ గారి వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహిస్తానంటూ.. కాళ్ళకు బలపాలు కట్టుకొని దేశమంతా తిరగడం చూసి.. జాతీయ పార్టీల నాయకులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఏమైనా…కనీసం ఎన్నికల పుణ్యాన అయినా.. ఇప్పటికి మీకు మళ్ళీ ప్రజలు గుర్తుకు వచ్చినందుకు ఆనందం.. అంటూ కేవీపీ ఆ లేఖలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.