Begin typing your search above and press return to search.

కేవీపీ బిల్లు ఆగస్టు 5కు వెళ్లింది

By:  Tupaki Desk   |   25 July 2016 12:54 PM IST
కేవీపీ బిల్లు ఆగస్టు 5కు వెళ్లింది
X
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు కొత్త మలుపు తిరిగింది. మొన్న శుక్రవారం ఈ బిల్లుపై చర్చకు రావాల్సిన సంగతి తెలిసిందే. అయితే.. అప్పటివరకూ ఒకటోనెంబరుగా ఉన్న ఏపీ ప్రత్యేకహోదా బిల్లు ఒక్కసారిగా14 నెంబరులోకి వెళ్లటం.. ఆ రోజున ఆమ్ ఆద్మీ ఎంపీ వీడియో ఘటనపై అధికార బీజేపీ సభ్యుల ఆందోళనల నేపథ్యంలో చర్చకు రాని పరిస్థితి.

వ్యూహాత్మకంగా వ్యవహరించిన బీజేపీ కారణంగా కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లు చర్చకు రాని నేపథ్యంలో.. ఈ బిల్లుపై చర్చను వీలైనంత ఆలస్యం చేయాలన్నట్లుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆగస్టు 5న ఈ బిల్లుపై చర్చ జరుగుతుందన్న మాటను రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ వెల్లడించారు. బీజేపీ వ్యూహాన్ని అర్థం చేసుకున్న కాంగ్రెస్ ఈ అంశంపై స్వరం పెంచింది. ఈ బిల్లును చర్చకు రానివ్వకుండా అధికార బీజేపీ ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తుందని ఆరోపించింది.

ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్ శర్మ బీజేపీ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ బిల్లుపై తక్షణమే చర్చకు అనుమతించాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. దీనికి సాధ్యం కాదని.. ఆగస్టు 5న చర్చ చేపడతామన్న కురియన్ మాటలకు కాంగ్రెస్ ససేమిరా అంటోంది. సభ్యుల హక్కుల్ని బీజేపీ హరిస్తోందంటూ మండిపడిన కాంగ్రెస్ .. ఏపీ ప్రత్యేక హోదా బిల్లుపై నిరసన తెలిపి అధికారపక్షానికి ఊహించని షాకిచ్చారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఇంత దూకుడుగా వ్యవహరిస్తుందన్న ఆలోచన లేని బీజేపీ ఢిఫెన్స్ లో పడిన పరిస్థితి. నిన్నమొన్నటి వరకూ కేవీపీ ప్రైవేటు బిల్లును పెద్దగా పట్టించుకోనట్లుగా కనిపించిన కాంగ్రెస్ అనూహ్యంగా.. ఆ బిల్లుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తాజా పరిణామాలతో స్పష్టమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదా బిల్లును కాంగ్రెస్ కానీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని.. దాని సంగతి తేల్చాలన్న పట్టుదలతో వ్యవహరిస్తే మాత్రం మోడీ సర్కారుకు కొత్త కష్టం ఎదురైనట్లే.