Begin typing your search above and press return to search.

మోదీని ముప్పతిప్పలు పెట్టేస్తానంటున్న కుటుంబరావు

By:  Tupaki Desk   |   5 Jun 2018 4:50 PM GMT
మోదీని ముప్పతిప్పలు పెట్టేస్తానంటున్న కుటుంబరావు
X
టీడీపీ - బీజేపీ సంబంధాలు దెబ్బతిన్న తరువాత రెండు పార్టీలూ ఎవరెక్కడ దొరుకుతారా అని ఎదురుచూస్తున్నాయి. తాజాగా ఎయిర్ ఏసియా కుంభకోణం వ్యవహారంలో చంద్రబాబు పేరు వినపడుతుండగా ..అందుకు కౌంటర్‌ గా చంద్రబాబు అనుకూల వర్గాలు కూడా కేంద్రంపై ఆరోపణలకు - బెదిరింపులకు దిగుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం షాక్ తినేలా ఒక భారీ కుంభకోణాన్ని మరో రెండు నెలల్లో బయటపెడతానని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీ విషయంలో బీజేపీ నేతలు చెబుతున్న మాటలకు - వాస్తవంలో జరుగుతున్న పనులకు సంబంధం లేదని విమర్శించారు. కేంద్రం నిధులు ఇస్తామన్న రాష్ట్రం తీసుకోవడం లేదంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. ఏపీకి ఎంతో ఇచ్చినట్లు చెబుతున్నారని... అలాంటప్పుడు కేంద్రానికి చెందిన ఐదుగురు అధికారులు - రాష్ట్రానికి చెందిన ఐదుగురిని అధికారులను నియమించి కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణం పంచనామా చేయమనండి! లెక్క తేలిపోతుందంటూ ఆయన అన్నారు.

జాతీయ మీడియాను కంట్రోల్‌లో పెట్టుకుని, ఎన్డీఏ తమ తప్పులు బయటపడకుండా చేసుకుంటోందని ఆయన అన్నారు. ఎన్డీఏ సహకార సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని అన్నారు. బీజేపీ హెడ్‌ క్వార్టర్స్‌ కట్టినంత సమయంలో అంటే 9 నెలల్లో ఏపీలో ఏదైనా ఒక్క ఇన్‌ స్టిట్యూట్‌ కట్టండని కుటుంబరావు డిమాండ్ చేశారు. నాలుగేళ్లలో ఏపీలో ఒక్క విద్యా సంస్థను కూడా కట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమకు పదేళ్ల సమయం ఇచ్చారని, ఆలోపు చేయాల్సింది చేస్తామని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, ప్రజలు ఎన్డీఏకి ఐదేళ్లు మాత్రమే సమయం ఇచ్చారని, ఆ తరువాత ఎవరు వస్తారో ఎవరికి తెలుసని ప్రశ్నించారు.