Begin typing your search above and press return to search.

బుజ్జగింపులు షురూ... రాములమ్మ మాట వింటుందా?

By:  Tupaki Desk   |   28 Oct 2020 5:40 PM GMT
బుజ్జగింపులు షురూ... రాములమ్మ మాట వింటుందా?
X
నానాటికీ హాట్ హాట్ గా మారిపోతున్న తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మరో ఆసక్తికర పరిణామం చక్కర్లు కొడుతోంది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేతగా ఎదిగిన టీ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం, ఆమెను నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న యత్నాలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలో అందరూ మునిగిపోయిన వేళ... బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన విజయశాంతి ఆయనతో సుదీర్ఘ భేటీనే వేశారు. ఇంకేముంది ఆమె కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిపోతున్నారన్న వార్తలు పుట్టుకొచ్చాయి. వైరల్ గా మారిపోయాయి. కీలకమైన దుబ్బాక బైపోల్స్ సందర్భంగా ఈ తరహా పరిణామాలు తమకు చేటు తెస్తాయని గ్రహించిన టీ కాంగ్రెస్ పెద్దలు వెంటనే రంగంలోకి దిగిపోయారు. అధిష్ఠానం ఆదేశాలతో రంగంలోకి దిగిన టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుమకుమార్.. నేరుగా విజయశాంతి వద్దకు వెళ్లారు. ఆమెతో సుధీర్ఘ భేటీ జరిపారు. పార్టీ మారితే జరిగే పరిణామాలు, పార్టీ ప్రాధమ్యాలు, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారితే పార్టీకి జరిగే నష్టం గురించి ఆయన విజయశాంతితో చర్చించినట్లుగా సమాచారం. అంతేకాకుండా పార్టీ మారాల్సిన అవసరం ఏముందని, పార్టీలో ఇప్పటికే తగిన ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పడంతో పాటు భవిష్యత్తులో మరింత మేర ప్రాధాన్యం ఇచ్చే విషయాలను కూడా ఆయన విజయశాంతి ముందు పెట్టినట్టుగా సమాచారం.

మొత్తంగా పార్టీ మారే యోచనలో ఉన్న విజయశాంతిని బుజ్జగించేందుకే కుసుమకుమార్ ఈ భేటీ నిర్వహించారని చెప్పక తప్పదు. అయితే రాజకీయాల్లో తాను ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరేమీ చెప్పినా అంతగా పట్టించుకున్న దాఖలా లేని విజయశాంతి... ఇప్పుడు కూడా కుసుమకుమార్ బుజ్జగింపులకు అంత సానుకూలంగా స్పందించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి తొలుత టీఆర్ఎస్ లో కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. మెదక్ ఎంపీగా విజయం సాధించిన ఆమె... తదనంతర పరిణామాల్లో పార్టీ అధినేత కేసీఆర్ వైఖరినే ప్రశ్నించారు. అంతేకాకుండా టీఆర్ఎస్ నుంచి బయటకు కూడా వచ్చేశారు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఏ పార్టీలో చేరకుండా ఉండిపోయిన రాములమ్మ.. మొన్నామధ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. విజయశాంతి ఎంట్రీతో తమకు ఓ స్టార్ క్యాంపెయినర్ దొరికిందని కాంగ్రెస్ పార్టీ కూడా సంతోషించింది. అయితే విజయశాంతి వల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్దగా లాభం అయితే చేకూరలేదనే చెప్పాలి. అయినా కూడా టీఆర్ఎస్ ను ఏ చిన్న అవకాశం చిక్కినా ఇరుకునపెట్టేలా సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి విజయశాంతి కూడా తనవంతు సహకారం అందిస్తున్నారు. అధికార పార్టీపై అవకాశం చిక్కినప్పుడల్లా తనదైన శైలిలో విరుచుకుపడుతూనే ఉన్నారు.

ఇలాంటి క్రమంలో ఉన్నట్టుండి తెలంగాణ బీజేపీలో కీలక నేతగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని విజయశాంతి కవలడం తెలంగాణ రాజకీయాల్లో కలకలమే రేపిందని చెప్పాలి. ఈ భేటీలో కిషన్ రెడ్డితో విజయశాంతి ఏం మాట్లాడారన్న విషయం బయటకు రాలేదు గానీ... ఆమె అయితే కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిపోయేందుకు సిద్దపడ్డారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలపై అటు బీజేపీ గానీ, ఇటు రాములమ్మ గానీ నోరు మెదపకున్నా... కూడా ఈ వార్తలకు అడ్డుకట్ట పడటం లేదు. దీంతో పరిస్థితి చేయిదాటిపోక ముందే మేల్కొన్న కుసుమకుమార్ హడావిడిగా రాములమ్మ్తతో భేటీ అయ్యారు. పార్టీ వీడుతున్నట్లుగా వస్తున్న ప్రచారంపై ఆమెతో చర్చించడంతో పాటుగా పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చిందన్న విషయాన్ని సూచించేందుకే ఆయన రాములమ్మతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. అయితే తాను ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇతరులెంత చెప్పినా అంతగా పట్టించుకోనట్టు సాగే విజయశాంతి ఇప్పుడు కుసుమకుమార్ మాట విని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా? అన్న విషయం ప్రశ్నార్థకంగా మారిపోయింది.