Begin typing your search above and press return to search.

హైదరాబాద్ వెళ్లాల్సిన బళ్లారి పేషెంట్లను కాపాడిన కర్నూలు ఎస్పీ

By:  Tupaki Desk   |   15 May 2021 5:30 AM GMT
హైదరాబాద్ వెళ్లాల్సిన బళ్లారి పేషెంట్లను కాపాడిన కర్నూలు ఎస్పీ
X
విపత్తు విరుచుకుపడిన వేళలో.. విభేదాల్ని పక్కన పెట్టి.. స్వార్థరహితంగా వ్యవహరించాల్సి ఉంది. మనిషి ఎవరైనా సరే.. ప్రాణం ముఖ్యమన్నట్లుగా వ్యవహరించాలి. అందుకు భిన్నంగా కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వద్ద తెలంగాణ రాష్ట్ర పోలీసులు అనుసరిస్తున్న వైఖరి.. పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చేలా ఉండటమే కాదు.. తెలంగాణ హైకోర్టు సైతం ఘాటుగా రియాక్టు అయ్యింది.

ఏపీ.. కర్ణాటక.. తమిళనాడు.. మహారాష్ట్రల నుంచి తెలంగాణకు వైద్యం వెళుతున్న వాహనాల్ని తెలంగాణ సరిహద్దుల్లో నిలిపివేయటం తెలిసిందే. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని.. ఆసుపత్రి వారు ఇచ్చిన లేఖల్ని చూపించినా.. తాము మాత్రం పంపేది లేదని అధికారులు మొండికేసిన వైఖరిని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇలాంటి వేళలో.. తమ రాష్ట్రానికి సంబంధం లేకున్నా.. సాటి మనిషిని కాపాడుకోవటం కోసం కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప చేసిన ప్రయత్నాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

ఎప్పటి మాదిరే శుక్రవారం సాయంత్రం పుల్లూరు టోల్ ప్లాజా వద్ద తెలంగాణ పోలీసులు అంబులెన్సును ఆపేశారు. అందులోని రోగులు కర్ణాటకలోని బళ్లారికి చెందిన వారు. వారికి అవసరమైన ఆక్సిజన్ ఆఖరకు వచ్చేస్తుంది. మరోవైపు అనుమతులు లేవంటూ తెలంగాణ పోలీసులు వారి వాహనాల్ని లోపలకు అనుమతించని పరిస్థితి. ఈ వేళలో అక్కడకు వచ్చిన కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప వెంటనే స్పందించారు.

ఆక్సిజన్ అయిపోతూ ఇబ్బంది పడుతున్న ఇద్దరు బళ్లారి పేషెంట్లకు అవసరమైన ఆక్సిజన సిలిండర్లను యుద్ధ ప్రాతిపదికన తెప్పించి.. వారికి చికిత్స అందించారు. దీంతో.. వారి ప్రాణాల్ని కాపాడారు. ప్రాంతం ఏదైనా కావొచ్చు.. అనారోగ్యం ప్రాణాలు తీసే వరకు వెళుతుంటే.. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతన్న విషయాన్ని కర్నూలు ఎస్పీ చేతల్లో చూపించారని చెప్పాలి. ఇందుకు ఆయన్ను ప్రత్యేకంగా అభినందించాల్సిందే. ఇలాంటి ఉదంతాల్ని తెలంగాణ పోలీసులు తెలుసుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.