Begin typing your search above and press return to search.

కాపుల్లో కదలిక : జడుస్తున్న తెదేపా!

By:  Tupaki Desk   |   15 Feb 2018 2:10 PM GMT
కాపుల్లో కదలిక : జడుస్తున్న తెదేపా!
X
తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి అన్నట్లుగా కాపుల రిజర్వేషన్ల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో బిల్లును ఆమోదించేసి - చట్టబద్ధత కోసం అనే మిష మీద కేంద్రానికి పంపేసి అక్కడితో చేతులు దులిపేసుకుంది. కేంద్రంనుంచి ఈ ఫైలు మీద స్పందన లేదా ఆటంకాలు ఎదురైనా సరే.. ఆ విషయం తేలేసరికి నెలలు గడచిపోతాయిలే.. తమ బాధ్యత పూర్తి చేసేసినట్లుగా కాపుల వద్ద మార్కులు కొట్టయేవచ్చు అని వారనుకున్నారు. కానీ.. అసలు వారు పంపిన బిల్లు లోనే లోపాలున్నాయి.. అసలు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలో సరైన కారణాలు కూడా పేర్కొనకుండా బిల్లు పంపితే ఆమోదం కేంద్రం ప్రభుత్వంలోని ఓ శాఖ హోం శాఖకు నివేదించినట్లు పాఠకులకు తెలుసు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గంలో అప్పుడే కదలిక మొదలైంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం వద్ద కాపుల రిజర్వేషన్ బిల్లు ఆగిపోవడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం చిత్తశుద్ధి లోపమే కారణం అని విమర్శలు షురూ అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలనుంచి కాపు నాయకులు గళమెత్తుతున్నారు. కాపుల్లో ఎలాంటి చైతన్యం రాకుండా చూడాలని ప్రభుత్వం ఇన్నాళ్లూ వక్రమార్గాలను అనుసరిస్తూ వచ్చిందో అదేచైతన్యం ఇప్పుడు వెల్లువెత్తుతుండేసరికి.. ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది.

ఒకవైపు కాపుల పోరాటానికి అన్నీ తానై వ్యవహరించే ముద్రగడ పద్మనాభం ప్రభుత్వం మీద తొలి అస్త్రం సంధించారు. కేంద్రంలో బిల్లు ఆగినట్లుగా పత్రికల్లో వస్తున్న వార్తలను గమనిస్తోంటే.. అసలు కాపులకు రిజర్వేషన్ కల్పించాలన్న చంద్రబాబునాయుడు చిత్తశుద్ధి మీదనే సందేహాలు కలుగుతున్నాయని ఆయన అంటున్నారు. రాష్ట్రప్రభుత్వం గవర్నరు సంతకంతోనే రిజర్వేషన్లను అమలు చేసేయడానికి న్యాయపరమైన వెసులుబాటు ఉన్నప్పటికీ.. చట్టబద్ధతపేరుతో బిల్లును కేంద్రానికి పంపినప్పుడే చంద్రబాబు దురాలోచన అందరికీ అర్థమైందని ఆయన ఆరోపిస్తున్నారు. వైకాపా మాజీ ఎమ్మెల్యే కాకినాడకు చెందిన కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు దురుద్దేశంతోనే మొక్కుబడిగా బిల్లును తయారుచేసి కేంద్రానికి పంపారని - అసలు రిజర్వేషన్ అమలుచేసి మాట నిలబెట్టుకునే ఉద్దేశమే ఆయనకు లేదని ఆరోపిస్తున్నారు. ఇంకా కేవలం పత్రికల్లో వచ్చిన వార్తల వరకే గనుక.. కాపుల అసంతృప్తి పోరాటం రూపం సంతరించుకోలేదని - కేంద్రంలో బిల్లు ఆగిపోయినట్లు అధికారిక వార్తలు వస్తే గనుక.. రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కలు కనిపిస్తాయని పలువురు అంచనా వేస్తున్నారు.