Begin typing your search above and press return to search.

ఉత్త‌మ్‌ కు కుంతియా భారీ మైలేజీ ఇచ్చారే!

By:  Tupaki Desk   |   14 Aug 2017 12:24 PM GMT
ఉత్త‌మ్‌ కు కుంతియా భారీ మైలేజీ ఇచ్చారే!
X
తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ త్వ‌ర‌లోనే సంపూర్ణంగా పున‌ర్వ‌వ‌స్థీక‌ణ కానుంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ఆ క‌మిటీ చీఫ్, మాజీ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి అస‌లు కంటి మీద కునుకే లేదు. నిన్న పార్టీ సీనియ‌ర్ నేత‌ - మాజీ డిప్యూటీ సీఎం దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌.. టీపీసీసీ వ్య‌వ‌హారాల ఇన్‌ చార్జీ కుంతియాతో భేటీతో ఉత్త‌మ్‌ లో ఈ ఆందోళ‌న మ‌రింత‌గా పెరిగింద‌నే చెప్పాలి. నేడో, రేపో... ఉత్త‌మ్ స్థానంలో తానే వ‌చ్చేస్తున్న‌ట్లుగా దామోద‌ర బిల్డ‌ప్ ఇచ్చార‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే దాకా గ‌డ్డం కూడా తీయించుకోన‌ని శ‌ప‌థం చేసిన ఉత్త‌మ్‌... ఈ ప‌రిణామాల‌తో నిజంగానే వ‌ణికిపోయార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అయితే తాజా ప‌రిణామాల‌తో ఇప్పుడు ఉత్త‌మ్ ఆ టెన్ష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డార‌ని తెలుస్తోంది. కాసేప‌టి క్రితం హైద‌రాబాదులో మీడియా ముందుకు వ‌చ్చిన కుంతియా పార్టీకి చెందిన ప‌లు అంశాల‌పై స‌వివ‌రంగానే మాట్లాడారు. పేరుకు చిట్ చాటే అయినా... ప్ర‌తి అంశంపై ఆయ‌న పూర్తి క్లారిటీతో మాట్లాడిన నేప‌థ్యంలో ఇక ఉత్త‌మ్ ఏమాత్రం భ‌య‌ప‌డాల్సిన‌, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయినా మీడియాతో కుంతియా ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాటే తుది నిర్ణయమని ఆయ‌న స్పష్టం చేశారు. 2019 వరకూ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డే తమ కెప్టెన్‌ అని తెలిపారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. పార్టీ కట్టు దాటితే..ఎంతటి నేత అయినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఉత్తమ్ పనితీరు పట్ల కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతృప్తిగా ఉన్నారని కుంతియా పేర్కొన్నారు. పొత్తులపై హైకమాండ్‌దే తుది నిర్ణయం అని వివరించారు. ఎవరితో కలవాలి..ఎప్పుడు కలవాలన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని, పొత్తులపై పీసీసీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని తెలిపారు. తన నుంచి, పీసీసీ వరకూ ఏ పదవుల్లోనూ మార్పులు ఉండవన్నారు. ప్రజలు తమవైపు చూస్తున్నారనడానికి సంగారెడ్డి సభే నిదర్శనం అని కుంతియా వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రతి మండలానికి వెళతామని, అన్నీ స్థాయిల్లో నేతల మధ్య విబేధాలు పరిష్కరిస్తామని తెలిపారు. రాహుల్‌ సందేశ్‌ యాత్రలు ఎన్నికల వరకు కొనసాగిస్తామన్నారు. పార్టీలో ఎవరినీ విస్మరించబోమని కుంతియ తెలిపారు.