Begin typing your search above and press return to search.

కుమారస్వామి సీఎం కాగానే యడ్డీ జైలుకు?

By:  Tupaki Desk   |   20 May 2018 7:58 AM GMT
కుమారస్వామి సీఎం కాగానే యడ్డీ జైలుకు?
X
రోజుకో మలుపు తిరుగుతూ రసకందాయంగా సాగిన కర్ణాటక రాజకీయం ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేదు. సీఎం కుర్చీ ముందు బోల్తాపడిన బీజేపీ నేత యడ్యూరప్పకు పదవి పోవడం ఒక్కటే కాకుండా కొత్తగా కేసుల్లో చిక్కుకునే పరిస్థితులూ కనిపిస్తున్నాయి. గతంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో జైలుకు వెళ్లిన బీజేపీ నేత యడ్యూరప్ప, ఇప్పుడు మరోమారు జైలుకెళ్లక తప్పదంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.

సీఎంగా ప్రమాణం చేసిన తరువాత ఆయన విశ్వాస పరీక్షలో నెగ్గేందుకుగాను ఇతర పార్టీల నేతలను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. యడ్యూరప్ప స్వయంగా కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి, వారిని ప్రలోభాలకు గురి చేయాలని చూడటం, వాటికి సంబంధించిన ఆడియోలను కాంగ్రెస్ బయట పెట్టిన విషయం తెలిసినవే. యడ్యూరప్ప - శ్రీరాములు - మురళీధర్ రావు - గాలి జనార్దన్ రెడ్డి తదితరులు కోట్ల కొద్దీ డబ్బు, మంత్రి పదవులు ఇస్తామంటూ మాట్లాడిన ఆడియోలను కాంగ్రెస్ బహిర్గతం చేసింది. ఇంకా కాంగ్రెస్, జేడీఎస్ వద్ద బీజేపీ నేతలకు చెందిన మరికొన్ని ఆడియో క్లిప్ లు ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ ఆడియో టేపులే ఆధారంగా యడ్యూరప్పపై పోలీసు కేసు పెట్టడానికి జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఈ పనిచేస్తామని జేడీఎస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే... ఆడియో టేపులను ఆధారాలుగా చూపినప్పుడు గతంలో కోర్టుల్లో పలు కేసులు నీరుగారిన నేపథ్యంలో వాటికి మరింత బలం చేకూరేలా ముందే అన్ని జాగ్రత్తులు తీసుకుంటున్నారట. ఎమ్మెల్యేల సెల్ ఫోన్లలో రికార్డు అయిన సంభాషణలను ఫోరెన్సిక్ రిపోర్టు కోసం పంపించి, ఆపై మాట్లాడింది యడ్యూరప్పేనని నిర్దారించి ఆయన్ను పక్కాగా ఇరికించాలని కాంగ్రెస్, జేడీఎస్ కూటమి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.