Begin typing your search above and press return to search.

బాబు - కేసీఆర్‌..క‌న్న‌డ నేల‌కు ఎందుకంటే..

By:  Tupaki Desk   |   19 May 2018 4:30 PM GMT
బాబు - కేసీఆర్‌..క‌న్న‌డ నేల‌కు ఎందుకంటే..
X
ఉత్కంఠ భ‌రితంగా కొన‌సాగి నేడు ఓ కొలిక్కి వ‌చ్చిన క‌ర్నాటక రాజ‌కీయాలు మ‌రోమారు తెల‌గు నేల‌ను ట‌చ్ చేశాయి. మే 15 నుంచి కర్ణాటక రాజకీయాలు అనేక మలుపులు తిరిగి చివరకు ఈ రోజు ఓ కొలిక్కి వచ్చిన సంగ‌తి తెలిసిందే. అసెంబ్లీలో బలనిరూపణకు ముందే సీఎం పదవి నుంచి యడ్యూరప్ప తప్పుకోగా.. సీఎం పీఠం జేడీఎస్ నేత కుమారస్వామికి దక్కే అవకాశం వచ్చింది. దీంతో.. కుమారస్వామి ఇవాళ రాత్రి 7.30కు రాజ్‌ భవన్‌ లో గవర్నర్ వాజూభాయ్‌ ని కలిశారు. ఈసందర్భంగా గవర్నర్ కుమారస్వామిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. దీంతో వచ్చే సోమవారం కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని కంఠీరవ మైదానంలో మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట మధ్యలో ప్రమాణ స్వీకారం ఉంటుందని గవర్నర్ మీటింగ్ అనంతరం కుమారస్వామి మీడియాకు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు.

ప్రజాస్వామ్య పరిరక్షణలో న్యాయవ్యవస్థ పాత్రను అభినందిస్తున్నాన‌ని కుమార‌స్వామి అన్నారు. కేంద్రప్రభుత్వం ఈడీ - సీబీఐలను ఉపయోగించి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నదన్నారు. తాను ఏమాత్రం భయపడనని.. దేన్నయినా దైర్యంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ఇవాళ రాత్రి కాంగ్రెస్ నేతలతో సమావేశమై సంకీర్ణ ప్రభుత్వం సజావుగా సాగేందుకు అవసరమైన విధివిధానాలు రూపొందిస్తామని కుమారస్వామి స్పష్టం చేశారు. మంత్రి పదవులపై వాళ్లతో చర్చించి నిర్ణయిస్తామన్నారు. సీఎంగా తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి దేశంలోని పలువురు నేతలను ఆహ్వానిస్తున్నట్లు కుమారస్వామి ప్రకటించారు. రాష్ట్ర సీఎం కే చంద్రశేఖర్‌ రావు - ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ - ఏపీ సీఎం చంద్రబాబునాయుడు - సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించనున్నట్లు కుమారస్వామి మీడియాకు తెలిపారు. వాళ్లంతా తనను అభినందించారని ఆయన చెప్పారు. వాళ్లతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు.

కాగా,ఈ ఆహ్వానంతో తెలుగు సీఎంలు ఒకే వేదిక‌పైకి సుదీర్ఘకాలం త‌ర్వాత రానున్నారు. ఈ ఇద్ద‌రు నేత‌లు బీజేపీకి వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా కేసీఆర్ అయితే జేడీఎస్‌కే ఓటువేయాల‌న్నారు. చంద్ర‌బాబు పార్టీ బీజేపీకి మాత్రం వేయ‌వ‌ద్ద‌ని కోరింది. తాజా ప్ర‌మాణ‌స్వీకారం సంద‌ర్భంగా ఈ ఇద్ద‌రు సీఎంలు భేటీ అవుతారా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.