Begin typing your search above and press return to search.

డిప్యూటీ సీఎంపై క్లారిటీ..క‌న్న‌డ ప్ర‌తిష్టంభ‌న కొలిక్కి

By:  Tupaki Desk   |   20 May 2018 9:47 AM GMT
డిప్యూటీ సీఎంపై క్లారిటీ..క‌న్న‌డ ప్ర‌తిష్టంభ‌న కొలిక్కి
X
సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌ ను మించి ఉత్కంఠ‌తో సాగి ఎట్టకేల‌కు ముగింపు ప‌డిన కర్ణాటక రాజ‌కీయంలో ఈరోజు మ‌రో ట్విస్ట్ నెల‌కొంది. రాజకీయ ప్రతిష్ఠంభనకు నిన్న సాయంత్రం తెరపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పదవుల పంపకంపై కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలు దృష్టి సారించాయి. జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌ డీ కుమారస్వామి సీఎం పదవి చేపట్టేందుకు కాంగ్రెస్ ఒప్పుకోవడంతో.. డిప్యూటీ సీఎం ఏ పార్టీ వారికి అప్పగించాలన్నది సమస్యగా మారింది.

స‌స్పెన్స్‌ కు తెర‌ప‌డిన అనంత‌రం జేడీఎస్‌ - కాంగ్రెస్‌లు వేర్వేరుగా క్యాంప్‌ లు ఏర్పాటు చేశాయి. త‌మ ప‌ద‌వుల సంగ‌తి ఏంట‌నే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఉప ముఖ్యమంత్రి - హోం మంత్రి పదవికి కాంగ్రెస్‌ కు ఇవ్వాలని ఆ పార్టీ మెలిక పెట్టినట్లు తెలుస్తుంది. అయితే మొత్తానికి డిప్యూటీ సీఎం పదవి కాంగ్రెస్‌ కే ఇచ్చేందుకు జేడీఎస్ సుముఖత చూపినట్లు సమాచారం. హోంమంత్రి పదవిపై మాత్రం సందిగ్ధత కొనసాగుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జి. పరమేశ్వర.. డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని విశ్వసనీయ సమాచారం.ఈ రోజు రాత్రివ‌ర‌కు స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని తెలుస్తోంది.

ఇక కాంగ్రెస్‌-జేడీఎస్‌ ల మ‌ధ్య మంత్రుల లెక్క‌పై కూడా స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. కాంగ్రెస్ నుంచి 20 మంది, జేడీఎస్ నుంచి 13 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. వీరి ప్రమాణస్వీకార కార్యక్రమం ఈ నెల 23న జరగనుంది. కుమారస్వామి రేపు ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీని కలవనున్నారు. ఇక ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ - ఏపీ సీఎం చంద్రబాబు - వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కుమారస్వామి ఆహ్వానించారు. తెలుగు రాష్ర్టాల సీఎంలు హాజ‌ర‌వుతున్న నేప‌థ్యంలో ఈ ప్ర‌మాణ‌స్వీకారంపై ఆస‌క్తి నెల‌కొంది.