Begin typing your search above and press return to search.

మీరు చెప్పిందే చేస్తాం.. మీరిచ్చిందే తీసుకుంటాం

By:  Tupaki Desk   |   21 May 2018 10:26 PM IST
మీరు చెప్పిందే చేస్తాం.. మీరిచ్చిందే తీసుకుంటాం
X
కర్ణాటకలో తనను సీఎం చేసినందుకు ధన్యవాదాలు చెప్పేందుకు గాను జేడీఎస్ నేత కుమారస్వామి కాంగ్రెస్ అధిష్ఠానంలోని పెద్దలను కలిశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ అయిన ఆయన ప్రభుత్వ ఏర్పాటు, మంత్రి పదవుల పంపకాలకు సంబంధించి చర్చించారు. అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ... ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోనియాను, రాహుల్‌ను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. వారు కూడా వస్తామని చెప్పినట్లు కుమారస్వామి వెల్లడించారు.

పొత్తు, ప్రభుత్వ ఏర్పాటులో అనుసరించాల్సిన విధివిధానాలకు సంబంధించి రాహుల్ గాంధీ పలు సూచనలు చేశారని, దాని అమలు బాధ్యతను కర్ణాటక కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్‌కు అప్పగించినట్లు చెప్పారు. కాగా డిప్యూటీ సీఎం పదవి విషయంలో కర్ణాటక కాంగ్రెస్ నేతలతో చర్చించి వేణుగోపాల్ ఏ విషయం చెబుతారని అన్నారు.

మరోవైపు రాహుల్ కూడా వారిద్దరి భేటీ గురించి ట్విటర్లో వెల్లడించారు. కుమారస్వామితో కర్ణాటకలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు రాహుల్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అదే విధంగా ఇరు పార్టీల మధ్య సమన్వయాన్ని మరింత పెంపొందించే అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. కర్ణాటక సీఎంగా కుమారస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా.. ఆ కార్యక్రమానికి తాను హాజరవుతున్నట్లు రాహుల్ స్పష్టం చేశారు.