Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు కంగారు పుట్టించేలా ఉన్న కూకట్ పల్లి ర్యాలీ ఫోటోలు

By:  Tupaki Desk   |   19 Oct 2019 6:40 AM GMT
కేసీఆర్ కు కంగారు పుట్టించేలా ఉన్న కూకట్ పల్లి ర్యాలీ ఫోటోలు
X
అవకాశమే ఇవ్వకూడదు. ఇస్తే.. దానికి చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణలోచోటు చేసుకున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి. రాజకీయాల్లో చీమ పట్టేంత చోటు ఇస్తే.. అదే చివరకు కొంప ముంచుతుందన్న చందంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? అంటే అవుననే మాట వినిపిస్తోంది.

సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ గెలుచుకున్న ఎంపీ సీట్లతో ఆ పార్టీలో పెరిగిన ఆత్మస్థైర్యం అంతా ఇంతా కాదు. తెలంగాణలో తిరుగులేదనుకునే కేసీఆర్ కుమార్తె కవితను ఎన్నికల్లో ఓడించటం మామూలు విషయం కాదు. తనకు తిరుగులేదని.. తాను ప్లాన్ చేస్తే పక్కాగా జరిగిపోతుందన్న ఆత్మవిశ్వాసం నిండుగా ఉండే మంత్రి తలసాని శ్రీనివాస్ సైతం తన కుమారుడ్ని గెలిపించుకోలేకపోయారు. ఇలా.. బలమైన అభ్యర్థులు ఉన్న చోట అధికారపక్షాన్ని ఓడించి మరీ గెలిచిన కమలనాథుల్లో కాన్ఫిడెన్స్ భారీగా పెరిగిపోయింది.

ప్యూచర్ లో తెలంగాణలో కాషాయజెండా ఎగురవేయటానికి తమకు అవకాశం ఉందన్న ఆశను పుట్టించాయి. అప్పటి నుంచి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న వారికి ఆర్టీసీ కార్మికుల సమ్మె అనుకోని వరంగా మారింది. ఆర్టీసీ కార్మికులకు తాము అండగా ఉంటామన్న భరోసాతో వారు చేస్తున్న సమ్మె ఇప్పుడు ఏకంగా పదిహేనో రోజుకు చేరుకుంది. సమ్మె విషయంలో వెనక్కి తగ్గకూడదన్న పట్టుదలతో కార్మికులు ఉంటే.. వారెంతవరకూ వెళతారో చూద్దామన్న మొండితనంతో ప్రభుత్వాధినేత ఉన్నారు.

ఇలా ఉభయులు తమ పట్టును ప్రదర్శిస్తున్న వేళ.. శుక్రవారం శేరిలింగంపల్లి నుంచి కుకట్ పల్లి వరకూ బీజేపీ నిర్వహించిన బైక్ ర్యాలీ జోరు చూసిన గులాబీ నేతలు అవాక్కు అయ్యే పరిస్థితి. హైదరాబాద్ శివారులో బీజేపీకి ఇంత పట్టు ఉందా? అని ఆశ్చర్యపోయేలా చేసింది. కనుచూపు మేరకు భారీ ఎత్తున బైకులతో ర్యాలీకి వచ్చిన వారితో బీజేపీ నేతలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. తాము నిర్వహించే ర్యాలీకి ఇంత భారీ స్పందన ఉంటుందని తాము ఊహించలేదంటున్నారు. ర్యాలీకి వచ్చిన వారిలో బీజేపీ కార్యకర్తలతో పాటు.. ఆర్టీసీ కార్మికులు వందల సంఖ్యలో ఉండటంతో వాతావరణం ఒక్కసారి మారిపోయింది. ఆర్టీసీ సమ్మె సంగతేమో కానీ.. సమీకరణాల్లో మార్పులు వస్తున్నాయన్న విషయాన్ని కూకట్ పల్లి ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీ స్పష్టం చేసిందని చెప్పాలి. ఈ ఫోటోల్ని సీఎం కేసీఆర్ కానీ చూస్తే.. ఆయనలో కంగారు పుట్టటం ఖాయమంటున్నారు.