Begin typing your search above and press return to search.

ముందుగానే మేల్కొన్న కేటీయార్

By:  Tupaki Desk   |   11 March 2021 1:15 PM IST
ముందుగానే మేల్కొన్న కేటీయార్
X
కేంద్రప్రభుత్వ విధానాలపై తెలంగాణా మంత్రి కేటీయార్ ముందుగానే మేల్కొన్నట్లున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర వైఖరికి వైజాగ్ లో ఆందోళనలు జరుగుతున్నా నరేంద్రమోడి ప్రభుత్వం ఏమాత్రం లెక్క చేయటంలేదు. జగన్మోహన్ రెడ్డి లేఖలు రాసినా, ఎవరెన్ని ఆందోళనలు చేసినా తాను అనుకున్న పద్దతిలోనే కేంద్రం ముందుకెళుతోంది.

ఈ విషయాన్నే కేటీయార్ బాగానే పసిగట్టినట్లున్నారు. అందుకనే విశాఖ ఉక్కు ఆందోళనలకు బహిరంగంగా మద్దతు పలికారు. ఈరోజు సమస్య ఏపిది అనుకుంటే రేపు ఇదే సమస్య తెలంగాణాకు కూడా ఎదురవుతుందని చెప్పటంలోనే మంత్రి పరిణతి కనబడుతోంది. బీహెచ్ఇఎల్, సింగరేణి కాలరీస్ సంస్ధను కూడా రేపు ఇదే పద్దతిలో కేంద్రం ప్రైవేటీకరించినా ఆశ్చర్యపోవక్కర్లేదన్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటీకరించేస్తామని నరేంద్రమోడి చెప్పినా ఆశ్చర్యపోవక్కర్లేదన్నారు.

కేటీయార్ చెప్పినదాంట్లో అతిశయోక్తి లేదన్న విషయం అందరికీ తెలిసిందే. మొదటిసారి గెలిచి అధికారంలోకి వచ్చిన ఐదేళ్ళల్లో రాష్ట్ర విభజన చట్టాన్ని తుంగలో తొక్కేసింది కేంద్రప్రభుత్వం. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని జనాలు ఎంత మొత్తుకున్నా నరేంద్రమోడి ఏమాత్రం పట్టించుకోలేదు. అప్పుడు చంద్రబాబునాయుడు అయినా ఇపుడు జగన్ అయినా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఉపయోగం లేకపోయింది.

ఇక రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న సంస్ధలను కూడా దెబ్బ కొడుతున్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేయటం ఇందులో భాగమే. ఇదే విషయాన్ని కేటీయార్ ముందుగానే పసిగట్టారు. కేసీయార్ ఆశీర్వాదం, అనుమతితో నేరుగా విశాఖ వెళ్ళి ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాల్గొంటామని చెప్పారు. ఇదే పద్దతిలో తెలంగాణాలో సమస్యలు వచ్చినపుడు ఏపి మద్దతు ఇవ్వాలని కూడా అడిగారు. మొత్తానికి కేటీయార్ ఆలోచన చూస్తుంటే కేంద్రం వైఖరిపై ముందుగానే మేల్కొన్నట్లే అనిపిస్తోంది. చూద్దాం వైజాగ్ ఆందోళనల్లో ఎప్పుడు పాల్గొంటారో.