Begin typing your search above and press return to search.

బెదిరించమంటూనే వార్నింగ్ ఇచ్చేసిన కేటీఆర్

By:  Tupaki Desk   |   24 Sep 2019 5:43 AM GMT
బెదిరించమంటూనే వార్నింగ్ ఇచ్చేసిన కేటీఆర్
X
తెలంగాణలో తండ్రికొడుకుల తీరు ఇప్పుడు ఆసక్తికర చర్చకు తావిస్తోంది. ఎవరైతే ఏంటి? మొహమాటాల్లేకుండా వార్నింగ్ లు ఇచ్చేయటమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కేసీఆర్.. కేటీఆర్ లు. గడిచిన రెండు రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరుగా చేస్తున్న హెచ్చరికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఉద్యోగుల్ని టార్గెట్ చేసినట్లుగా మారిన ఇద్దరి హెచ్చరికలపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారంటున్నారు.

అవునన్నా.. కాదన్నా.. ఎంత పాలకులైనా చివరకు ఆధారపడాల్సింది ఉద్యోగులపైనే. తాము పని చేయించుకోవాల్సిన వారిని బెదిరించి.. హెచ్చరించేయటం ద్వారా తమకు తగ్గట్లు ఫలితాలు సాధించగలమని తండ్రి కొడుకులు భావిస్తున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఆదివారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ ఉద్యోగులపైనా.. వీఆర్వో వ్యవస్థ మీద చేసిన వ్యాఖ్యల్ని మర్చిపోలేం.

శాఖ ఏదైనా.. ఉద్యోగులు ఎవరైనా సరే.. ఆ వ్యవస్థను రద్దు చేస్తాం.. ఈ విధానాన్ని రద్దు చేసి పారేస్తామంటూ చేస్తున్న హెచ్చరికలు సరైనవి కావంటున్నారు. బెత్తం పట్టుకొని గదమాయిస్తే పరిస్థితి వేరుగా ఉంటుందన్న విషయాన్ని ఎలా మర్చిపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు.. అందునా రెవెన్యూ ఉద్యోగులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు రేపిన కలకలం ఒక కొలిక్కి రాకముందే.. తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీస్తున్నాయి.

ఉద్యోగుల్ని బెదిరించటం తమ ప్రభుత్వ అభిమతం కాదని.. తప్పు చేసే ఉద్యోగుల వెన్నులో భయం పుట్టాలన్నదే తమ ఉద్దేశంగా మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తమది స్నేహపూర్వక ప్రభుత్వంగా అభివర్ణించిన ఆయన.. మార్చిన పురపాల సంఘం చట్టం కఠినంగా ఉంటుందన్నారు.

ఇళ్ల అనుమతి కోసం సమర్పించే స్వీయ ధ్రువీకరణ పత్రంలో తప్పులు దొర్లితే.. వాటిని సబ్ మిట్ చేసిన తొలివారంలోనే రిజెక్ట్ చేయాలని.. అందుకు భిన్నంగా 21 రోజుల వరకూ కమిషనర్లు రియాక్ట్ కాకుంటే.. దరఖాస్తుదారులకు అనుమతులు లభించినట్లేనని స్పష్టం చేశారు. ఇలా పెండింగ్ పెట్టే కమిషనర్ల మీద చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఉద్యోగుల్లో స్పూర్తిని నింపి పని చేయించుకోవాల్సింది పోయి.. అందుకు భిన్నంగా వార్నింగ్ లు ఇచ్చి ఎక్కువకాలం పని చేయించలేమన్న విషయాన్ని తెలంగాణ తండ్రీకొడుకులు ఎందుకు మర్చిపోతున్నారన్న డౌట్ పలువురికి కలుగుతోంది. ఎందుకంటారు?