Begin typing your search above and press return to search.

కేటీఆర్ ట్వీట్లు.. మునుగోడుకు చేర‌తాయా?

By:  Tupaki Desk   |   13 Oct 2022 5:23 AM GMT
కేటీఆర్ ట్వీట్లు.. మునుగోడుకు చేర‌తాయా?
X
ఔను.. ఇది తాడో పేడో తేలే స‌మ‌యం. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఉప‌పోరుకు రంగం సిద్ధ‌మైన నేప‌థ్యం. మ‌రి ఈ స‌మ‌యంలో హైద‌రాబాద్‌లో కూర్చుని ట్వీట్ల యుద్ధం చేస్తే.. మునుగోడు ప్ర‌జ‌ల చెవుల‌కు చేరుతుందా? ఇదీ.. ఇప్పుడు స‌గ‌టు టీఆర్ ఎస్ అభిమాని సంధిస్తున్న ప్ర‌శ్న‌. కార్య‌రంగంలోకి దిగితే త‌ప్ప‌.. కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తే.. విజ‌యం ద‌క్క‌డం ఇబ్బందేన‌ని అంటున్నారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు?

తాజాగా మంత్రి కేటీఆర్ ట్వీట్ల యుద్ధం చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం నల్గొండ జిల్లాకు 18వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తే మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుందని ఆయన రాసుకొచ్చారు. ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం మిషన్ భగీరథకు రూ.19వేల కోట్లు కేటాయించమని నీతిఆయోగ్‌ సిఫార్సు చేస్తే పట్టించుకోని కేంద్రం... రాజకీయ ప్రయోజనం కోసం ఒక వ్యక్తికి 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు ఇచ్చిందని ఆరోపించారు.

గుజరాత్‌కేమో 5నెలల్లో 80వేల కోట్ల ప్యాకేజీలు, తెలంగాణకు కనీసం 18వేల కోట్లు ఇవ్వలేరా? అని కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. అయితే.. పార్టీ అభిమానులు మాత్రం.. ట్వీట్ల యుద్ధంతో ప్ర‌యోజ‌నం లేద‌ని అంటున్నారు. రంగంలోకి దిగాల‌ని అంటున్నారు. మ‌రి ఎప్ప‌టి నుంచి కేటీఆర్ ప్ర‌చారంలోకి వ‌స్తారో చూడాలి.

ప్ర‌చారం హోరెత్తుతోంది!

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దిశానిర్దేశంతో మునుగోడులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చండూరులో ప్రచారం చేస్తున్నారు.

నియోజకవర్గానికి రాజగోపాల్‌రెడ్డి చేసిందేమీ లేదని చెబుతున్నారు. చౌటుప్పల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గడపగడపకూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించిన ఘనత త‌మ‌ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెబుతున్నారు.

నాంపల్లిలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నబీజేపీనే బలవంతంగా మునుగోడు ఉప ఎన్నికను తీసుకొచ్చిందని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్ర‌చారం చేస్తున్నారు. ఉపఎన్నికల్లో డబ్బును వెదజల్లుతోందని మండిపడుతున్నారు. అయితే.. కేటీఆర్ మాత్రం హైద‌రాబాద్ నుంచి క‌ద‌ల‌డం లేద‌నేది.. అభిమానుల మాట‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.