Begin typing your search above and press return to search.
హరీశ్‌ను దాటేసేందుకు కేటీఆర్ ఇలా చేస్తున్నారా?
By: Tupaki Desk | 5 April 2018 11:35 AM ISTతెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ ను సీఎం చేసేందుకు సిద్ధమవుతున్నారా? మంత్రి హరీశ్ రావును కేవలం ప్రాజెక్టుల పనితీరుకే పరమితం చేస్తూ తన కుమారుడిని రాష్ట్రవ్యాప్తంగా పర్యటింపచేయడంలో కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో పెట్టారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రగతి సభల పేరిట కేటీఆర్ జిల్లాల చుట్టేస్తున్న నేపథ్యంలో ఈ చర్చ తెరమీదకు వస్తోంది. జిల్లా కలెక్టర్ భవన నిర్మాణ శంకుస్థాపనలు - భవన సముదాయాల ప్రారంభాల తో పాటు పలు ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతూ మంత్రి కేటీఆర్ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇవన్నీ ప్రగతి సభల పేరిట జరుగుతుండటం..ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకావాల్సిన వాటికి కేటీఆర్ విచ్చేస్తుండటం గమనార్హం. ఇదే సమయంలో మంత్రి హరీశ్ రావును అప్పగించిన పనికే పరిమితం చేయడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్ క్యాబినెట్ లో హరీశ్ రావు - కేటీఆర్ మంత్రులుగా ఉన్నా రాష్ట్రవ్యాప్తంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ హాజరవడాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. గతంలో నిజామాబాద్ - ఆదిలా బాద్ - కరీంనగర్ - వరంగల్ - నల్లగొండ - ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈసారి నూతనంగా నిర్మించిన జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్ ల భవన నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం - వరంగల్ - మహబూబాబాద్ - ఉమ్మడి మహబూబ్ నగర్ ఇలా వరుసగా రోజుకొక జిల్లాలో మంత్రి పర్యటించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నా - ఆ హోదాలో కేటీఆర్ ప్రారంభిస్తుండడంతో ఆయనకు అధికారం లాంఛనమే అన్న ప్రచారం రాజకీయ సర్కిళ్లలో మొదలైంది. టీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ సభ పూర్తయ్యే నాటికి పూర్తి పగ్గాలు కేటీఆర్ చేతుల్లోకి వెళ్లడం ఖాయమన్న చర్చ నడుస్తోంది. గత కొన్నిరోజులుగా జరుగుతున్న పనులే ఇందుకు ఉదాహరణలని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.
మరోవైపు పార్టీలోనూ - ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించిన పనికే మంత్రి హరీశ్ రావు పరిమితమయ్యారు. ఆయన ప్రాజెక్టుల బాట పడుతున్నారు. మిగతా వాటిల్లో ఫోకస్ అయ్యేందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో పాటు తనకు కేటాయించిన సాగునీటి శాఖపైనే కేంద్రీకరించారు. కాళేశ్వరం - పాలమూరు సాగునీటి ప్రాజెక్టులతో పాటు, మిగతా సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం మంత్రి హరీశ్ రావు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వారానికి రెండు రోజులు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ప్రాజెక్టు దగ్గరే ఒక అతిధి గృహాన్ని నిర్మించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిసింది. అదేవిధంగా మిగతా ప్రాజెక్టులను కూడా సందర్శిస్తారని అధికారులు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ ప్రభుత్వ కార్యక్రమాలు నడిచినా, అంతిమంగా ఇందులో కేటీఆర్ ను అధికారానికి దగ్గర చేస్తున్నారన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. భవిష్యత్తులో జరిగే రైతు పెట్టుబడి పథకం చెక్కుల పంపిణీలోనూ కేటీఆర్ పాల్గొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాతీయ రాజకీయాలకు వెళ్లబోతున్నట్టుగా కేసీఆర్ ప్రకటించడంతో ఈ ప్రచారం మరింత ఎక్కువైంది. రాబోయే ప్లీనరీలో కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
