Begin typing your search above and press return to search.

కొత్త ఇమేజ్ కోసం కేటీఆర్ ఆరాటం మామూలుగా లేదుగా?

By:  Tupaki Desk   |   15 Nov 2020 12:00 PM IST
కొత్త ఇమేజ్ కోసం కేటీఆర్ ఆరాటం మామూలుగా లేదుగా?
X
సమర్థత ఉంది. కష్టపడే గుణం తక్కువేం కాదు. రాజకీయ ప్రత్యర్థుల మీద దుమ్మెత్తిపోయటానికి.. తమ వాదాన్ని సమర్థవంతంగా వినిపించటానికి అవసరమైన మాటల చాతుర్యం ఉంది. అన్నింటికి మించి తెలంగాణలో తిరుగులేని రాజకీయ అధినేత కేసీఆర్ కుమారుడు అన్న ట్యాగ్ ఉండనే ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ.. మరింత కావాలన్నట్లుగా ఉంది కేటీఆర్ తీరు చూస్తే.

ముంచుకొస్తున్న గ్రేటర్ ఎన్నికల్లో తనకున్న ఇమేజ్ ను మరింత పెంచేందుకు వీలుగా కొత్త వ్యూహాన్ని మంత్రి కేటీఆర్ సిద్ధం చేసినట్లుగా కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో తాజాగా.. ఆయన తన గురించి..తనఇష్టాల గురించి సరికొత్తగా చెప్పటం షురూ చేశారు.

ప్రపంచంలో తనకెంతో ఇష్టమైన వ్యక్తులు ఎవరో తెలుసా? అన్న ప్రశ్నకు ఆయనకు ఆయనే సమాధానం ఇస్తూ.. పిల్లలుగా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. బోసినవ్వుల బుజ్జాయిల నుంచి చిన్నారులకు సంబంధించి.. వారితో తానున్న ఫోటోల్ని ఏర్చికూర్చి మరీ ట్విట్టర్ లో ట్వీట్ చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ ఎప్పుడూ తన వ్యక్తిగత ఇష్టాల గురించి పెద్దగా ప్రస్తావించటం కనిపించదు.

అందునా.. తనకు చిన్నారులంటే ఇష్టం లాంటి ఇమేజ్ బిల్డింగ్ పనులు చేయలేదు. అందుకు భిన్నంగా తాజాగా పెడుతున్న పోస్టులు చూస్తుంటే..ఇతర రాజకీయ నేతలకు భిన్నంగా తన ఇమేజ్ ను పెంచుకోవాలన్న తపనలో ఉన్నట్లు కనిపిస్తోంది. కీలకమైన గ్రేటర్ ఎన్నికల వేళ.. పిల్లల్ని అభిమానించే రాజకీయ నేతగా ఇమేజ్ పెంచుకోవటం.. నగర జీవుల్ని ఆకర్షిస్తుందని చెబుతున్నారు. ఏమైనా.. కొత్త తరహా ఆలోచనల కుప్పగా కేటీఆర్ ను చెప్పక తప్పదు.