Begin typing your search above and press return to search.

కేటీఆర్ లాబీయింగ్‌ కు మోడీ ఓకే చెప్తారా?

By:  Tupaki Desk   |   8 Feb 2018 9:40 AM IST
కేటీఆర్ లాబీయింగ్‌ కు మోడీ ఓకే చెప్తారా?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మ‌రోమారు త‌న స‌త్తా చాటుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఏకంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి త‌న స‌త్తా ఏంటో చూపించేందుకు కేటీఆర్ రెడీ అవుతున్నారు. ఈ క్ర‌మంలో త‌న శ‌క్తి సామ‌ర్థ్యాలు స‌రిపోవ‌ని భావించారేమో కానీ..ప్ర‌త్యేక రీతిలో లాబీయింగ్ చేయిస్తున్నారు. కేటీఆర్ స్కెచ్ ఫ‌లిస్తే...వ‌చ్చేవారంలోనే ప్ర‌ధాని మోడీ మ‌రోమారు హైద‌రాబాద్‌ కు రానున్నారు.

గ‌త ఏడాది ఇటు హైద‌రాబాద్ మెట్రో ప్రారంభం సంద‌ర్భంగా - అటు గ్లోబ‌ల్ ఎంట‌ర్ ప్రెన్యూర్ షిప్ స‌మ్మిట్‌ ను పుర‌స్క‌రించుకొని మంత్రి కేటీఆర్ ప్ర‌ధాని మోడీకి చేరువ అయిన సంగ‌తి తెలిసిందే. ఒక ద‌శ‌లో మోడీ కూడా కేటీఆర్‌ ను ప్ర‌త్యేకంగా గౌర‌వించారు. ఇలాంటి గుర్తింపునే మ‌రోమారు మంత్రి కేటీఆర్ ఆశిస్తున్న‌ట్లుగా ఉందని చ‌ర్చ జ‌రుగుతోంది. భార‌త‌దేశంలో మొట్ట‌మొద‌టిసారిగా అందులోనూ హైద‌రాబాద్‌ లో జ‌రుగుతున్న ప్ర‌పంచ ప్రఖ్యాత వ‌ర‌ల్డ్ ఐటీ కాంగ్రెస్‌ కు ప్ర‌ధానిని ర‌ప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే త‌న ఒక్క‌డి ప్ర‌య‌త్నంతోనే ప్ర‌యత్నం స‌ఫ‌లం కాద‌నుకున్నారో ఏమో కానీ.. భార‌త‌దేశ ఐటీ రంగంలో కీల‌క‌మైన వేదిక అయిన నాస్కాంతో ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు.

నాస్కాం ప్రెసిడెంట్‌ ఆర్‌.చంద్రశేఖర్‌ - సైయంట్‌ వ్యవస్థాపకుడు - ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి - టెక్‌ మహీంద్రా ఎండీ - సీఈఓ సీపీ గుర్నానీతో ఈ ఏర్పాట్లపై క్యాంప్‌ ఆఫీసులో మంత్రి కేటీఆర్‌ బుధవారం చర్చించారు. ఐటీ రంగంలోనే కీలకమైన సదస్సుగా పేరొందిన వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్‌ కు ఆతిథ్యం ఇవ్వడం తమకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. ఈ సదస్సును విజయవంతంగా పూర్తిచేసేందుకు ఇప్పటికే అన్ని ప్రభుత్వ విభాగాలు క్రియాశీలంగా పనిచేస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు హాజరయ్యే అతిథులను సాదరంగా ఆహ్వానించేందుకు - సదస్సు జరిగే సమయంలో వారికి సక్రమమైన ఏర్పాట్లు చేసేందుకు పూర్తి చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమాన్ని టీవీ - ప్రింట్‌ - ఎలక్ట్రానిక్‌ మీడియా సహా సోషల్‌ మీడియాలో ప్రచారం చేసేందుకు కృషి చేయాలని సంబంధిత వర్గాలకు మంత్రి సూచించారు. నాస్కాం లీడర్‌ షిప్‌ సమ్మిట్‌ తో పాటుగా వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్‌ నిర్వహించేందుకు సాగుతున్న సన్నాహాలను ఈ సందర్భంగా నాస్కాం ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ కు వివరించారు. ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించామని పేర్కొంటూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాచారం రావాల్సి ఉందన్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వం భాగ‌స్వామ్యం పంచుకుంటున్న ఈ స‌ద‌స్సుకు త‌మ త‌ర‌ఫున మాత్ర‌మే ఆహ్వానం అందితే మోడీజీ వ‌చ్చేందుకు త‌టప‌టాయిస్తార‌ని భావించే....ఈ విస్తృత వేదిక ద్వారా ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అంటున్నారు. కేటీఆర్ లాబీయింగ్ ఏ మేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి మ‌రి.